హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నేడు మీడియాతో మాట్లాడారు. ప్రజల సెంటిమెంటును వాడుకుని ఓట్లు అడిగే హక్కు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎక్కడిదని ప్రశ్నించారు. పథకాలు, డబ్బులతో పాటు పలు ప్రలోభాలకు కేసీఆర్ గురిచేసినప్పటికీ హుజూరాబాద్ ప్రజలు తనను అక్కున చేర్చుకున్నారని అన్నారు. తన గెలుపుతో కేసీఆర్ కు నిద్ర కూడా పట్టడం లేదని అన్నారు. హుజూరాబాద్ ఎన్నికల్లో రూ. 600 కోట్లను ఖర్చుపెట్టినా ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోయారని అన్నారు. సీఎం కేసీఆర్ డబ్బు సంచులకు, మద్యానికి హుజురాబాద్ ప్రజలు లొంగకుండా కేసీఆర్ చెంప ఛెళ్లు మనిపించారని ఈటల అన్నారు. ప్రజలు ధర్మం, న్యాయం, వైపు ఉండి నీతి నిజాయితీ రాజకీయాలు చేసే నేతలను ఎన్నుకోవాలని ఆయన కోరారు. కేసీఆర్ మాటలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు పూర్తిగా దిగజారిపోయాయని ఈటల రాజేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. అప్పట్లో మాజీ మంత్రి రామస్వామి బుల్లెట్ పైనే అసెంబ్లీకి వచ్చేటోడని ఆయన గుర్తు చేసుకున్నారు. మాజీ మంత్రి రామస్వామి 85వ జయంతి వేడుకల్లో ఈటల రాజేందర్ మాట్లాడుతూ రామస్వామి గొప్ప మహనీయుడని, ఆయన ప్రజలకు అందించిన సేవలు ఎంతో గొప్పవని కొనియాడారు. రామస్వామి, నరసింహారెడ్డి బుల్లెట్ పైన అసెంబ్లీకి వచ్చేటోళ్లని, మరికొందరైతే ఆటోలలో వచ్చేవాళ్లని గుర్తు చేసుకున్నారు. ఇప్పటికీ గుమ్మడి నర్సయ్య పూరి గుడిసెలో ఉంటారని అన్నారు. అయితే నీతి నిజాయితీ విలువలతో కూడుకున్న రాజకీయ నేతలను కేసీఆర్ ఇబ్బందులు పెడుతున్నడని ఈటల రాజేందర్ ఆరోపించారు. 2023లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ కు రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెపుతారని ఈటల జోస్యం చెప్పారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ అన్నీ అబద్ధాలే చెపుతున్నారని.. నిధులు కేంద్రానివి, పథకాలపై ఫొటోలు మాత్రం కేసీఆర్ వి అంటూ ఆయన విమర్శలు చేశారు.
గురువారం గురువారం గౌలిగూడలో శ్రీ విఠలేశ్వర బాల భక్త సమాజం ఆధ్వర్యంలో మాజీ మంత్రి రామస్వామి 85వ జయంతి వేడుకల్లో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామితో కలసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రామస్వామి విగ్రహాన్ని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆవిష్కరించారు.