తెలంగాణలో హుజూరాబాద్, ఏపీలో బద్వేలు శాసనసభ స్థానాల ఉపఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ రెండు నియోజకవర్గాల్లో అక్టోబర్ 30న పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ దాఖలుకు అక్టోబర్ 8ని చివరి తేదీగా నిర్ణయించారు. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా అక్టోబర్ 13న నిర్ణయించారు. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఈ రెండు నియోజకవర్గాలతో పాటు దేశంలోని 14 రాష్ట్రాల్లోని 30 అసెంబ్లీ, 3 లోక్ సభ నియోజకవర్గాలకు అక్టోబర్ 30న ఉపఎన్నికలను నిర్వహించనున్నారు. ఏపీలోని బద్వేల్ లో వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతి చెందడంతో అక్కడ ఉపఎన్నిక జరుగుతోంది.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో హుజూరాబాద్ కు ఉపఎన్నిక వచ్చింది. ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి జూన్ 12న రాజీనామా చేశారు. దీంతో హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. తెలంగాణ లోని హుజూరాబాద్ ఉపఎన్నికను పలు పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. షెడ్యూల్ విడుదలవ్వక ముందే ఎన్నో రాజకీయాలు హుజూరాబాద్ నియోజకవర్గం చుట్టూ సాగాయి. ఇప్పుడు షెడ్యూల్ విడుదల కావడంతో రాబోయే రోజుల్లో అక్కడ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయా అని అందరూ ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ ను వీడి భారతీయ జనతా పార్టీలోకి వచ్చారు ఈటల రాజేందర్. ఆయనను ఓడించడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ప్రణాళికలనే రూపొందిస్తోంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నుండి భారీ ఎత్తున వరాలు హుజూరాబాద్ పై కురిపించింది. తాను ప్రజల మనిషినని.. ప్రజలే తనను ఈసారి కూడా గెలిపిస్తారని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో టీఆర్ఎస్ పార్టీ తరపున విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తున్నారు. మూడు నెలలుగా హుజూరాబాద్‌లో టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి.