హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రయత్నిస్తూనే ఉంది. ఈ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీదే విజయమని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. ఈటల రాజేందర్ ను కేసీఆర్ మోసం చేశాడని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. ఈ ఉపఎన్నిక న్యాయం, ధర్మాన్ని కాపాడుకోవడానికి, అహంకారాన్ని ఓడించడానికి జరుగుతున్న ఎన్నిక అని ఈటల రాజేందర్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేసినా గెలిచేది బీజేపీనే అని.. కేవలం హుజూరాబాద్ లో మాత్రమే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ వ్యతిరేకత ఉందని అన్నారు. ప్రజల్లో బలం ఉందని చెప్పుకుంటున్న టీఆర్ఎస్… చిల్లర రాజకీయాలు ఎందుకు చేస్తోందని విమర్శించారు. టీఆర్ఎస్ కుల సంఘం భవనాలను కట్టిస్తామంటూ ప్రజలను మభ్య పెడుతున్నారని.. ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా టీఆర్ఎస్ ను ప్రజలు నమ్మబోరని అన్నారు. యావత్ తెలంగాణ ప్రజలు హుజూరాబాద్ ఉపఎన్నిక వైపు చూస్తున్నారని.. ఆత్మగౌరవాన్ని గెలిపించుకుందామని హుజూరాబాద్ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
ఇక తెలంగాణలో వైయస్సార్ తెలంగాణ పార్టీ ఇటీవలే ఎంటర్ అయిన సంగతి తెలిసిందే..! హుజూరాబాద్ నియోజకవర్గానికి త్వరలోనే ఉపఎన్నిక జరగనుండడంతో వైయస్సార్ తెలంగాణ పార్టీ పోటీ చేసే అవకాశాలపై కథనాలు వస్తున్నాయి. ఈ కథనాలపై వైయస్ షర్మిల స్పందించారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో తమ పార్టీ పోటీ చేయడం లేదని ఆమె ప్రకటించారు. పగ, ప్రతీకారం కోసం వచ్చిన ఎన్నికలే హుజూరాబాద్ ఉపఎన్నికలని అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక వల్ల ఏం ఉపయోగమని ప్రశ్నించారు. ఈ ఉపఎన్నిక వల్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయా? అని అడిగారు. దళితులకు మూడెకరాల భూమి వస్తుందా? అని ప్రశ్నించారు. ఇవన్నీ చేస్తామని ప్రభుత్వం చెపితే తాము కూడా పోటీ చేస్తామని అన్నారు.