హుజూరాబాద్ అసెంబ్లీ స్థానంలో ఈటల రాజేందర్ వరుసగా ఏడో విజయం అందుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల కొన్ని కారణాల వలన టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు తన స్వగ్రామంలోనూ, అత్తగారి ఊర్లోనూ ఆధిక్యం పొందలేకపోయారు. సొంతూరు హిమ్మత్ నగర్ లో గెల్లుకు 358 ఓట్లు రాగా, ప్రత్యర్థి ఈటల రాజేందర్ కు 549 ఓట్లు వచ్చాయి. అత్తగారి ఊరైన పెద్దపాపయ్యపల్లెలో గెల్లు కంటే ఈటలకు 76 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు సాయంత్రం వరకూ సాగింది. మొత్తం 22 రౌండ్ల పాటు కౌంటింగ్ జరిగింది. రెండు రౌండ్లు మినహా మిగిలిన అన్ని రౌండ్లలోనూ ఈటల ఆధిక్యం స్పష్టమైంది. టీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై 24,068 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికలో విజయం అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ హుజూరాబాద్ నియోజకవర్గంలో తన ఓటమిని కోరుకుంటూ ప్రత్యర్థులు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ప్రజలు తన పక్షానే నిలిచారని.. వారికి శిరసు వంచి వందనం చేస్తున్నానని తెలిపారు. ఈ గెలుపు తనలో మరింత బాధ్యతను పెంచిందని, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటానని వెల్లడించారు. ఈ విజయం వెనుక ఎన్నో కష్టాలను ఓర్చుకుని నిలిచిన బీజేపీ కార్యకర్తలు ఉన్నారని, వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు.
ఈ ఫలితం కేసీఆర్ అహంకారానికి చెంపపెట్టు వంటివదని, కేసీఆర్ ఈ ఎన్నికలో ప్రజాస్వామ్యాన్ని నమ్ముకోకుండా డబ్బు సంచులను, అన్యాయం, అక్రమాలను నమ్ముకున్నారని ఈటల విమర్శించారు. ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న తెలంగాణ వాదులందరూ కేసీఆర్ అహంకారం పోవాలని కోరుకున్నారని, హుజూరాబాద్ లో ఎలాంటి ఫలితం వస్తుందని ఆసక్తికరంగా ఎదురుచూశారని ఈటల అన్నారు. ఆఖరికి శ్మశానంలో కూడా డబ్బులు పంచారని, ఇష్టారీతిన అధికార దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
ఇకమీదట 5 అంశాలపై తాను పోరాడతానని ఈటల చెప్పారు. దళిత బంధు తరహాలో మిగతా కులాలకు ఆర్థికసాయం, డబుల్ బెడ్రూం ఇళ్లు, తెలంగాణ నినాదం (నీళ్లు, నిధులు, నియామకాలు), 57 ఏళ్లు నిండినవారికి వృద్ధాప్య పెన్షన్లు, రైతులకు గిట్టుబాటు ధర అంశాలపై తన పోరాటం ఉంటుందని అన్నారు.