Telugu States

హరీష్ రావుకు వార్నింగ్ ఇచ్చిన ఈటల.. అంబేద్కర్ చౌరస్తా దగ్గరకు రా

టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీ తరపున బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. హుజూరాబాద్ ఉపఎన్నికను టీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మంత్రి హరీశ్ రావు గత కొన్ని రోజులుగా హుజూరాబాద్ కే పరిమితమయ్యారు. ఈటలకు ఉన్న మద్దతుదారులను తమ వైపు తిప్పుకోవాలని.. ప్రజలను ప్రసన్నం చేసుకోడానికి చాలా ప్రయత్నాలను హరీష్ రావు చేస్తున్నారని బీజేపీ ఇప్పటికే ఆరోపిస్తోంది. బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామితో కలిసి మాట్లాడిన ఈటల రాజేందర్ హరీశ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. హరీశ్ రావు మతి భ్రమించి, ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హరీశ్ మాట్లాడే ప్రతి మాట వ్యంగ్యంగా ఉంటోందని అన్నీ అసత్యాలే మాట్లాడుతున్నారని ఈటల విమర్శించారు. హుజూరాబాద్ లో అభివృద్ధే జరగలేదని హరీశ్ అంటున్నారని ఈ అసత్య ప్రచారంపై చర్యకు హరీశ్ సిద్ధమా? అని సవాల్ విసిరారు. ఉన్నతమైన స్థానంలో ఉన్న హరీశ్ దిగజారి మాట్లాడటం బాధాకరమని.. హరీశ్ విచక్షణ కోల్పోయి ఇలాగే మాట్లాడితే ప్రజలు అసహ్యించుకుంటారని చెప్పారు.

హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టించలేదని తనపై హరీశ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని… జమ్మికుంట, కమలాపూర్, హుజూరాబాద్ లలో 500ల చొప్పున ఇళ్లు కట్టించానని ఈటల అన్నారు. హరీశ్ తనతో పాటు వస్తే వీటిని చూపిస్తానని అన్నారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ లు ఈ రాష్ట్రం మాది, ఈ రాష్ట్రాన్ని మేమే సాధించామనే రీతిలో మాట్లాడుతున్నారని విమర్శించారు. హరీశ్ రావు, కేసీఆర్, కేటీఆర్ లు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల మధ్యలో ఉన్న దుబ్బాకలో రోడ్లు వేశారా? డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించారా? అని ఈటల ప్రశ్నించారు. ఏమీ చేయనందుకే దుబ్బాకలో టీఆర్ఎస్ ను జనాలు ఓడించారని అన్నారు. తన మీద విమర్శలు గుప్పించినంత మాత్రాన గొప్ప వ్యక్తులు కాబోరని చెప్పారు. తన వెనకున్న కార్యకర్తలు, తనకు మద్దతు పలుకుతున్న వారిని ప్రలోభాలకు గురి చేస్తున్నారని.. కాంట్రాక్టర్ల బిల్లులను కూడా ఆపేశారని.. టీఆర్ఎస్ తో ఉంటేనే బిల్లులు మంజూరు చేస్తామని చెపుతున్నారని విమర్శించారు.

త‌న‌ మీద చేసిన ఆరోపణలపై చర్చకు తాను సిద్ధమ‌ని, చ‌ర్చించేందుకు హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా దగ్గరకు రావాల‌ని స‌వాల్ విసిరారు. ఇందుకు కావాల్సిన‌ అన్ని ఏర్పాట్లు తానే చేస్తానని చెప్పారు. హరీశ్ రావు ఓ తోపు అని అనుకుంటున్నారా? అని ఈట‌ల ప్ర‌శ్నించారు. హరీశ్ రావు నిర్వాకంపై ప్రజలు చీద‌రించుకుంటున్నార‌ని ఆయ‌న చెప్పారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

17 − 1 =

Back to top button