తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ హైదరాబాద్‌లోని గన్ పార్కుకు వచ్చి అమరవీరులకు నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఆయన అసెంబ్లీ స్పీకర్‌కు రాజీనామా సమర్పించారు. అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మేట్‌లో తన రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. ఈరోజు సాయంత్రం ఈటల ఢిల్లీ వెళ్లనున్నారు. జూన్ 14న జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ లోకి చేరనున్నారు. ఈటల వర్గం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, తుల ఉమ, మరికొంతమంది నేతలు బీజేపీలో చేరనున్నారు.
గన్ పార్క్ వద్ద మీడియాతో మాట్లాడుతూ ఈటల మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. తాను ప్రజల మద్దతుతోనే ఇన్నాళ్లూ ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నానని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి నాకు ఇన్నాళ్లు టీఆర్ఎస్ పార్టీ బీఫాం ఇచ్చి ఉండొచ్చు కానీ, నేను గెలుస్తున్నది మాత్రం ప్రజల మద్దతుతోనే అని చెప్పుకొచ్చారు. వారే నన్ను గెలిపిస్తున్నారని తెలిపారు. అధికార దుర్వినియోగం చేసి టీఆర్ఎస్ ఉప ఎన్నికలో గెలవాలని ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను టీఆర్ఎస్ పట్టించుకోవట్లేదని విమర్శలు గుప్పించారు. 17 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నానని.. ఇప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానన్నారు. ప్రజలను మభ్యపెడుతూ టీఆర్ఎస్ గెలుస్తోంది. నాలాంటి వారిపై ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ ఈ రోజు ఎలాంటి ధోరణిని అవలంబిస్తుందో ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు గమనించాలి. హుజూరాబాద్ లో జరగనున్న ఉప ఎన్నిక కేసీఆర్ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు జరగనున్న ఎన్నిక వంటిదని తెలిపారు. ప్రజలు ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటారని.. తెలంగాణ ప్రజలు, రైతులు, నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోని కేసీఆర్ లాంటి వారికి గట్టిగా బుద్ధి చెప్పాలని ఈటల మీడియాతో తెలిపారు.
