More

    టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్

    ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కనీసం తన వివరణ అడగకుండా ఓ అనామకుడు రాసిన లేఖను చూసి రాత్రి రాత్రే బర్తరఫ్ చేశారని.. అదే తనను ఎంతగానో బాధించిందని అన్నారు. హుజూరాబాద్ ప్రజల మద్దతు తనకు ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు, తనకు మధ్య ఐదేళ్లుగా గ్యాప్ వచ్చిందని ఈటల రాజేందర్ తెలిపారు. తనను ఎన్నో సార్లు అవమానించారని.. అయినా కూడా తాను ఏదీ మాట్లాడకుండా సహిస్తూ వచ్చేశానని అన్నారు. ప్రగతి భవన్ కాదని.. అది బానిస భవన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసమే ఇన్నాళ్లు కూడా అవమానాలను భరిస్తూ వచ్చానని.. చెప్పుకుంటూ వెళితే ఎన్నో అవమానాల గురించి బయట పెట్టొచ్చని ఈటల రాజేందర్ తెలిపారు. మంత్రులకు కనీసం గౌరవం లేదని.. మంత్రులు లేకుండానే సమీక్షలు నిర్వహించారని అన్నారు. హరీష్ రావుకు కూడా అవమానం జరిగిందని అన్నారు. బానిస కంటే అధ్వాన్నంగా ఉన్న మంత్రి పదవి నాకు అవసరం లేదని తేల్చి చెప్పారు ఈటల రాజేందర్. తెలంగాణా గడ్డ మీద సంఘాలు కూడా తన కంట్రోల్ లోనే ఉండాలని అనుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులను ఎంతగా కేసీఆర్ వేధించారో అందరూ చూశారని ఈటల రాజేందర్ అన్నారు. ఉద్యమ సమయంలో ఎంతో అండగా నిలిచిన సంఘాలను ఇప్పుడు కనీసం పట్టించుకోవడం లేదని ఈటల రాజేందర్ ప్రశ్నించారు.

    తెలంగాణ రాష్ట్రంలో సమ్మెలు చేస్తే సమస్యలు పరిష్కారమవ్వడం లేదని.. ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్ పాలకులు కూడా ఇంత ఘోరంగా ప్రవర్తించలేదని ఈటల విమర్శలు గుప్పించారు. సంక్షేమ పథకాలను నేనెప్పుడూ వ్యతిరేకించలేదని.. కొన్ని సూచనలు మాత్రమే చేశానని అన్నారు. రైతు బంధు విషయంలో కూడా తాను అలాంటి సూచనలే చేశానని అన్నారు. పేదలకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడానని అన్నారు. నా నియోజకవర్గంలో పింఛన్ లు ఇప్పించలేని దుస్థితి తనదని అన్నారు. ‘ముఖ్యమంత్రికి చెప్పి ఇప్పిస్తానని అన్నానని.. నేనే ఇప్పిస్తానని మాత్రం చెప్పలేకపోయానని’ ఈటల రాజేందర్ అన్నారు. ఒక్క మంత్రి పదవిని ఇచ్చి నన్ను బానిసలా బ్రతకమని అంటే.. బ్రతకలేనని అన్నారు. కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే పని చేస్తామని హరీష్ రావు కూడా అన్నారని.. నేను కూడా అదే మాట అన్నానని.. అందులో తప్పేముందో నాకు అర్థం అవ్వడం లేదని ఈటల రాజేందర్ అన్నారు. ఒకప్పుడు కేసీఆర్ ను తీవ్రంగా విమర్శించిన వాళ్లే.. ఇప్పుడు ఆయన పంచన చేరారని అన్నారు. నన్ను తెలంగాణ ప్రజల నుండి వేరు చేయాలని చేసిన ప్రయత్నాలు ఎప్పటికీ సఫలమవ్వమని.. తానెప్పుడూ తెలంగాణ ప్రజలతోనే ఉంటానని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం రక్తం చిందించింది మేమే.. జైళ్లలో మగ్గింది కూడా మేమేనని అన్నారు. రాచరికం పద్ధతిలో కేసీఆర్ పదవిలోకి రాలేదనే విషయాన్ని గుర్తించుకోవాలని అన్నారు. ఒక్క మంత్రైనా స్వేచ్ఛగా పని చేసే పరిస్థితి తెలంగాణలో లేదని ఈటల రాజేందర్ ఉన్నారు. అధికారులు, మంత్రులు కేవలం కేసీఆర్ చెప్పింది రాసుకుని రావాల్సిందేనని అన్నారు. వరవరరావు జైలులో ఉంటే కూడా కేసీఆర్ కనీసం పలకరించలేదని అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారని ఈటల రాజేందర్ విమర్శించారు. నియంతనే అని కేసీఆర్ అన్నారని.. ప్రజాస్వామ్యంలో నియంతలకు చోటు ఉండదని అన్నారు. ఆర్ఎస్ఎస్ కూడా తెలంగాణ ఉద్యమానికి ప్రకటించిందని అన్నారు. ‘నా నెత్తి కొట్టే ప్రయత్నం మీరు చేశారు.. మీ నెత్తిని ఎవరో ఒకరు కొడతారు’ అని ఈటల రాజేందర్ విమర్శించారు. ‘నేను బానిసను కాను.. ఉద్యమ సహచరుడిని..’ అని ఈటల రాజేందర్ వెల్లడించారు. తాను కొత్త పార్టీ పెట్టాలని అనుకోలేదని.. తిరుగుబాటు చేయాలని కూడా అనుకోలేదని రాజేందర్ అన్నారు. ఏనుగు రవీందర్ రెడ్డి కూడా తనతో పాటూ రాజీనామా చేస్తున్నారని తెలిపారు. మరికొందరు నాయకులు కూడా టీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నారని ఈటల రాజేందర్ తెలిపారు.

    Related Stories