ఈటల రాజేందర్ రాజకీయ ప్రస్తానంలో ఇటీవలి కాలంలో ఎన్నో మలుపులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే..! తనను కావాలనే టీఆర్ఎస్ ప్రభుత్వం అనవసరమైన కేసుల్లో ఇరికించిందని ఈటల ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ కూడా ఈటలను పార్టీ నుండి తొలగించింది. ఆయన మొదట ప్రత్యేకంగా తెలంగాణలో పార్టీ పెడతారని భావించినా.. చివరికి భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపించారు. భారతీయ జనతా పార్టీ కూడా ఆయన రాకను స్వాగతిస్తూ ఉంది.
అందులో భాగంగా ఆయన ఢిల్లీకి వెళ్లి పలువురు భారతీయ జనతా పార్టీ పెద్దలను కలిశారు. ఈటల రాజేందర్ శుక్రవారం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారని ఇప్పటికే వార్తలు గుప్పుమన్నాయి. జూన్ 8 లేదా 9వ తేదీల్లో బీజేపీలో చేరబోతున్నారని తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్‌ను, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిసి ఈటల రాజేందర్ చర్చించారు. ఏనుగు రవీందర్‌రెడ్డి, తరుణ్ చుగ్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామితో కలిసి బీజేపీ జాతీయ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో బుధవారం సాయంత్రం ఈటల భేటీ అయ్యారు. ముందు ఎమ్మెల్యే పదవికి, ఆ తర్వాత టీఆర్ఎస్‌కు ఈటల రాజీనామా చేస్తారని ఆ తర్వాత బీజేపీలో చేరనున్నారు.
ఢిల్లీ పర్యటన ముగించుకుని ఈటల రాజేందర్ హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయానికి నేడు చేరుకున్నారు. ఈటలకు ఆయన అనుచరులు, మద్దతుదారులు ఘనస్వాగతం పలికారు. శుక్రవారం నాడు ఈటల మీడియా సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యచరణ ప్రకటించనున్నారు. ఈటల రాజేందర్ రాకపై తెలంగాణ బీజేపీ నేతలు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఈటల ఎంట్రీపై కామెంట్లు చేశారు. ఈటల రాజేందర్ మరో వారం రోజుల్లో బీజేపీలో చేరుతారని సంజయ్ తెలిపారు. ఎలాంటి హామీలు లేకుండానే ఆయన బీజేపీలోకి వస్తున్నారని.. బీజేపీ సిద్ధాంతాలు, మోదీ పాలన నచ్చే ఆయన బీజేపీలో చేరుతున్నారని అన్నారు. బీజేపీ నేత విజయశాంతి మాట్లాడుతూ తమ్ముడు ఈటల రాజేందర్ బీజేపీ వైపు సరైన దిశగా వెళుతున్నారని, మంచి నిర్ణయం తీసుకున్నందుకు అభినందిస్తున్నానని అన్నారు. టీఆర్ఎస్ ను ఎదిరించి నిలిచి, గెలిచే సత్తా బీజేపీకి మాత్రమే ఉందనేది తిరుగులేని వాస్తవం అని అన్నారు. కాంగ్రెస్ నుంచి గెలిపించిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వెళ్లిపోతారన్న భావం తెలంగాణ ప్రజల్లో ఇప్పటికే పూర్తిగా నిరూపితమైందని అన్నారు.