బీజేపీలో చేరిన ఈటల

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీలోకి చేరారు. ఈ రోజు ఢిల్లీలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాషాయ కండువా కప్పి ఆయనను ధర్మేంద్ర ప్రధాన్ తమ పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ జడ్పీ ఛైర్పర్సన్ తుల ఉమ, తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘ నేత అశ్వత్థామరెడ్డి తదితరులు బీజేపీలోకి చేరారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు.
ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంపై తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీపై విశ్వాసంతో ఈటల రాజేందర్ ఈ రోజు పార్టీలో చేరారని.. నియంతృత్వ పాలన నుంచి బయటకు రావాలని గొప్ప నిర్ణయం తీసుకున్నారని అభినందించారు. కాషాయ జెండా పట్టుకుని ముందుకు సాగాలని.. తెలంగాణలో ‘గడీల పాలన’ను బద్దలు కొట్టాలని నిర్ణయం తీసుకున్నారని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. ఆయనకు బీజేపీ తరఫున స్వాగతం పలుకుతున్నామన్నారు.. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు. కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం ఉన్న పార్టీ బీజేపీ అని ప్రజలు భావిస్తున్నారు.. బీజేపీ ఉద్యమంలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరుతున్నామని పిలుపునిచ్చారు.
ఈటల మాట్లాడుతూ తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకుని రావడానికి శ్రమిస్తామని అన్నారు. సర్వ శక్తులు ఒడ్డుతామని స్పష్టం చేశారు. హుజూరాబాద్‌లో బీజేపీ గెలుపుతో పార్టీ జైత్రయాత్రకు శ్రీకారం చుడతామని చెప్పారు. పార్టీ ఇచ్చిన పనిని పూర్తి చేస్థానని.. రాష్ట్రంలో బీజేపీ పార్టీ ప్రతిష్టకు కృషి చేస్తామన్నారు. బీజేపీ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా పని చేస్తానన్నారు. రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల నుంచి బీజేపీలోకి చేరికలుంటాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన పలువురు బీజేపీ కీలక నేతలను కలిసే అవకాశం ఉంది. రేపు ఈటల తిరిగి హైదరాబాద్ రానున్నారు.