More

    ఈటల చుట్టూ తిరుగుతున్న తెలంగాణ రాజకీయం..!

    తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ చుట్టూ రాజకీయం తిరుగుతోంది. ఆయన భారతీయ జనతా పార్టీలోకి చేరుతారా.. లేక కొత్త పార్టీ పెడతారా అనే విషయమై ఓ క్లారిటీ రావాల్సి ఉంది. ఈటల మాత్రం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి పోటీ చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఆయన కొత్త పార్టీ పెడితే ఆ పార్టీలోకి చేరే నాయకులు ఎవరా..? అనే చర్చ కూడా సాగుతోంది. అలాగే ఆయన పలువురు నాయకులతో భేటీ అవుతుండడం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఈటల రాజేందర్ ఆయన నివాసంలో టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై ఆయనతో చర్చించారు. రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని భావించారని. కాంగ్రెస్ నుంచి సానుకూల స్పందన రాలేదని కూడా ప్రచారం జరుగుతూ ఉంది.

    ఈటల రాజేందర్ బీజేపీ లోకి వెళ్ళబోతూ ఉన్నారనే ప్రచారం కూడా సాగుతోంది. త్వరలో ఆయన బీజేపీ చీఫ్ నడ్డాతో భేటీ కానున్నారని.. త్వరలోనే ఢిల్లీ వెళ్లనున్నారనే ప్రచారం ఊపందుకుంది. మరో మూడు రోజుల్లోనే ఆయన కాషాయ కండువా కప్పుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. ఈటలతోపాటు కామారెడ్డి జిల్లాకు చెందిన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి కూడా బీజేపీలో చేరనున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. బీజేపీ కీలక నేతలతో గత కొన్ని రోజులుగా ఈటల టచ్ లో ఉన్నారట..! తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ ఛుగ్‌, తెలంగాణ చీఫ్ బండి సంజయ్, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామితో ఫోన్‌లో మాట్లాడినట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి చెందిన ఆరెస్సెస్ కీలక నేతలతోనూ ఈటల సంప్రదింపులు జరిపినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే బీజేపీకి చెందిన ఏ నేత కూడా ఈటల ఎంట్రీపై వ్యాఖ్యలు చేయలేదు. ప్రస్తుతానికైతే తెలంగాణ రాజకీయం ఈటల చుట్టూ తిరుగుతోంది. ఆయన కొత్త పార్టీ పెడతారా.. భారతీయ జనతా పార్టీ లోకి చేరుతారా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.

    Related Stories