నిలకడగా ఈటల రాజేందర్ ఆరోగ్యం.. పరామర్శించిన బండి సంజయ్

0
784

మాజీ మంత్రి ఈటల రాజేందర్ హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేరారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో పన్నెండు రోజులుగా పాదయాత్ర చేస్తున్న బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు తీవ్ర జ్వరం, కాళ్లకు పొక్కులు రావడంతో పాదయాత్రను తాత్కలికంగా నిలిపివేశారు. కరీంనగర్‌లో ఆయనకు వైద్యం అందించారు. వైద్యుల సలహాతో ఆయనను హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో వైద్యులు ఈటలకు చికిత్స అందిస్తున్నారు. ఆయ‌న మొద‌ట హైద‌రాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స తీసుకున్నారు. అనంత‌రం అక్క‌డి నుంచి జూబ్లిహిల్స్‌లోని అపోలో ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

బీజేపీ తెలంగాణ‌ అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ నేత‌ వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు ర‌వీంద‌ర్ మరికొందరు నేతలు ఈట‌ల‌ను ప‌రామ‌ర్శించారు. ఆయన ఆరోగ్య ప‌రిస్థితి గురించి వైద్యుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం కుదుట‌ప‌డ్డాక త‌న పాదయాత్ర‌ వాయిదాపడ్డ గ్రామం నుంచే ఈటల తిరిగి ప్ర‌జా దీవెన యాత్ర‌ను ప్రారంభిస్తారని బీజేపీ నాయకులు తెలిపారు. వేయాల్సిన అడుగులు, చేరాల్సిన ఊళ్లు చాలానే ఉన్నాయని, ఆగిన చోటు నుంచే యాత్ర మొదలవుతుందని ఈటల రాజేందర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఊహించని అస్వస్థత కారణంగా ‘ప్రజా దీవెన’ యాత్రను తాత్కాలికంగా వాయిదా వేయాల్సి వచ్చినందుకు బాధగా ఉందని, ఆరోగ్యం కుదుటపడగానే మళ్లీ యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. కొండంత మీ దీవెనలు తనకు కావాలని ఆయన అన్నారు.

“పన్నెండు రోజులుగా,222 కిలోమీటర్లకు పైగా సాగిన ప్రజా దీవెన యాత్రలో ప్రతి క్షణం నా వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరికీ పాదాభివందనం. వేయాల్సిన అడుగులు,చేరాల్సిన ఊళ్లు చాలా ఉన్నాయి.కానీ ఊహించని అస్వస్థత వల్ల ప్రజా దీవెన యాత్రని తాత్కాలికంగా నిలిపివేయాల్సి వస్తున్నందుకు చాలా బాధగా ఉంది. ఆరోగ్యం సహకరించగానే ప్రజా దీవెన యాత్ర మళ్ళీ పునః ప్రారంభం అవుతుంది. ఆగిన చోటు నుండే అడుగులు మొదలవుతాయి. కొండంత మీ దీవెనలతో త్వరలో ప్రజా దీవెన యాత్రతో వస్తాను.
మీ..ఈటల రాజేందర్.” అంటూ ఆయన ట్వీట్ చేశారు.

శుక్రవారం వీణవంక మండలంలో ప్రజాదీవెన యాత్ర చేస్తున్న సమయంలో ఈటల రాజేందర్‌ అస్వస్థకు గురయ్యారు. ఈటల రాజేందర్‌కు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆయనకు ఆక్సిజన్‌, బీపీ స్థాయిలు పడిపోయినట్లు తెలిపారు. దీంతో మెరుగైన చికిత్స కోసం వెంటనే ఈటల రాజేందర్‌ను హైదరాబాద్ తరలించారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here