ఉప ఎన్నిక ముందు ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

0
673

హుజూరాబాద్ ఉప ఎన్నిక దగ్గర పడుతున్న సమయంలో బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ నేతలు తన మీద దాడి చేస్తారనే భయం తనకు ఉందని అన్నారు. కుట్రలు, కుతంత్రాలతో ప్రచారపర్వాన్ని కొనసాగిస్తున్నారని ఆయన విమర్శించారు. నోట్ల కట్టలు, మద్యం సీసాలతో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎన్ ను ఓడించి కేసీఆర్ కు హుజూరాబాద్ ప్రజలు బుద్ధి చెపుతారని అన్నారు. టీఆర్ఎస్ నేతలు ఎంత ప్రయత్నించినా పోలింగ్ రోజున ఏం చేయాలో ఓటర్లు అదే చేస్తారని చెప్పారు. ఓడిపోతామనే భయంతో టీఆర్ఎస్ నేతలు ఏం చేయడానికైనా సిద్ధమవుతున్నారని ఆరోపించారు. ఆ పార్టీ నేతలు ఇప్పటి వరకూ ఎన్ని చేయాలో అన్నీ చేశారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఆదేశించడం హరీశ్ అమలు చేయడం జరుగుతోందని అన్నారు. తన రాజకీయ జీవితంలో ఒక్క మనిషికి కూడా ఇబ్బంది కలగనివ్వలేదని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. అధికారం ఉంటేనే నీళ్ళు వస్తాయి అనుకోవడం తప్పు అని అన్నారు. తనను పట్టుకొని ఈ గడ్డ మీద అభివృద్ది చేయలేదు అని మాట్లాడేవాళ్లను నిలదీయాలని ప్రశ్నించారు. తాను మధ్యలో వచ్చి మధ్యలో పోయేవాడినా ? అని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో రూ. 70 కోట్ల మందు తాగించారని ఆరోపించారు. కేసీఆర్ చెంప చెళ్లుమనిపించేలా తీర్పు ఇవ్వాలని ఈటల రాజేందర్ కోరారు.

హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న బీజేపీ నేత విజయశాంతి మాట్లాడుతూ… దళితుడిని బూతులు తిట్టి, కొట్టిన దళిత విద్రోహి హరీశ్‌ రావు అని విమ‌ర్శించారు. హుజూరాబాద్‌లో దళితులపై ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారని.. అప్ప‌ట్లో కేటీఆర్‌ని ఓడించాలని హ‌రీశ్ రావు కుట్ర పన్నార‌ని ఆమె ఆరోపించారు. దుబ్బాకలో చెల్లని హరీశ్ రావు వ్యూహాలు ఇప్పుడు హుజూరాబాద్‌లో చెల్లుతాయా? అని ఆమె ప్ర‌శ్నించారు. దళిత ఉద్యోగిని బూతులు తిట్టిన చరిత్ర హరీశ్ రావుదని… ఆయనొక దళిత విద్రోహి అని అన్నారు. దళితబంధు గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా ఆయనకు లేదని చెప్పారు. దుబ్బాకలో చెల్లని హరీశ్ రావు హుజూరాబాద్ లో చెల్లుతారా? అని ప్రశ్నించారు.