నన్ను చంపడానికి జిల్లాకు చెందిన ఒక మంత్రి కుట్ర చేస్తున్నారు: ఈటల

బీజేపీ నేత ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకర్గంలో పాదయాత్రను మొదలుపెట్టారు. తనను చంపడానికి జిల్లాకు చెందిన ఒక మంత్రి కుట్ర చేస్తున్నాడంటూ ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. తన హత్య కోసం హంతక ముఠాతో చేతులు కలిపాడని అన్నారు. అక్కడితో ఆగని ఈటల.. గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అరేయ్ కొడకల్లారా… నన్ను చంపుతానని నయీం బెదిరించినప్పుడే నేను భయపడలేదు. ఈ చిల్లర ప్రయత్నాలకు కూడా భయపడనని అన్నారు. ఉగ్గుపాలతోనే ఉద్యమాలు చేసిన చరిత్ర తనదని అన్నారు. ఆత్మ గౌరవం కోసం ఏ స్థాయిలో అయినా కొట్లాడతామని చెప్పారు. దళితబంధు పథకాన్ని పెట్టడం సంతోషమే అయినా దళితులకు మూడు ఎకరాల భూమిని ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని ఈటల ప్రశ్నించారు. కేవలం ఎన్నికల కోసం పథకాలను తీసుకురావద్దని అన్నారు. రెండేళ్లుగా ఇవ్వని రేషన్ కార్డులు, పెన్షన్లని ఇప్పుడు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. దుబ్బాక ఉపఎన్నికలో వచ్చిన ఫలితమే హుజూరాబాద్ ఉపఎన్నికలో కూడా వస్తుందని అన్నారు. తన ఇంటికి వచ్చిన వారిని ఏ కులం, ఏ మతం అని తాను ఏనాడూ అడగలేదని… ఏం కష్టం వచ్చిందని అడిగి సహాయం చేశానని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రజాకార్లను తలపిస్తున్నారని.. హుజూరాబాద్ నియోజకవర్గంలోని సర్పంచ్‌లకు సీఎం వెలకట్టారని, ఈ విషయం తనకు తెలుసునని అన్నారు. ఉగ్గుపాలతో ఉద్యమాలు చేసిన వాడినని చెప్పుకొచ్చారు ఈటల. ఈటల మల్లయ్య కొడుకుని ఆత్మగౌరవం కోసం ఏ స్థాయిలో అయినా కొట్లాడతా అని అన్నారు. 2018 ఎన్నికల్లోనే తనను ఓడించేందుకు టీఆర్ఎస్ ప్రయత్నం చేసిందని అయితే ప్రజలు తనకు అండగా నిలిచారని చెప్పారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని ఈటల చెప్పుకొచ్చారు. చట్టం మీద నాకు విశ్వాసం ఉందని ఈటల అన్నారు.