ఇస్రోలో మరో నంబి నారాయణన్..? రాకెట్ సైంటిస్ట్ సంచలన ఆరోపణలు..!

0
697

నంబి నారాయణన్.. కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. భారత అంతరిక్ష రంగాన్ని అగ్రదేశాలకు దీటుగా నిలపాలని.. కలలుగన్న గొప్ప శాస్త్రవేత్త. భారీ అంతరిక్ష ప్రయోగాల్లో విదేశాలపై ఆధారపడుతున్న ఇస్రోకు.. క్రయోజనిక్ ఇంజిన్ టెక్నాలజీని అందించి.. భారత్ సత్తాను ప్రపంచ దేశాలకు చాటాలని తపనపడిన దేశభక్తుడు. అలాంటి గొప్ప శాస్త్రవేత్తపై అమెరికా కన్నుపడింది. నాసాలో చేర్చుకోవాలని గాలం వేసింది. అయినా,.. అగ్రారాజ్యం కుట్రలకు నంబి నారాయణన్ చిక్కలేదు. లక్షల్లో జీతం ఎరగా వేసిన నాసా ఆఫర్‎ను తిరస్కరించి.. దేశం కోసమే పనిచేశారు నంబి నారాయణన్. అప్పటివరకు అగ్రదేశాలకు మాత్రమే సాధ్యమైన క్రయోజనిక్ ఇంజిన్ టెక్నాలజీని భారత్‎కు అందించాలనే ఉద్దేశంతో రాత్రింబవళ్లు పరిశోధనలు చేశారు. అయితే, భారత్‎కు ఈ టెక్నాలజీ అందితే తమ అంతరిక్ష వ్యాపారానికి గండిపడుతుందని భావించిన అమెరికా.. నంబి నారాయణన్‎పై మరో కుట్రకు తెరతీసింది. ఇందుకోసం రంగంలోకి దిగిన సీఐఏ.. వేగులను పంపి నంబి నారాయణన్‎ను దేశద్రోహిగా చిత్రీకరించేందుకు నాటకమాడింది. అయితే, అమెరికా పేరు చెబితే ప్యాంటు తడుపుకునే నాటి పాలకులు.. దేశద్రోహ ఆరోపణలపై ఎలాంటి పరిశీలన చేయకుండానే ఆయనపై దేశద్రోహిగా ముద్రవేసింది. ఒక శాస్త్రవేత్త అని కూడా చూడకుండా జైల్లో పెట్టి నానా హింసలకు గురిచేసింది. ఆ తర్వాత విచారణలో ఆయన ఎటువంటి తప్పు చేయలేదని తేలినా,.. పుణ్య కాలం కాస్తా గడిచిపోయింది.

ఈ కేసులో అమెరికా సీఐఏతో పాటు కేరళ పోలీసుల పాత్ర కూడా ఉన్నట్లు ఎన్నో అనుమానాలు వచ్చాయి. దాదాపు ఇరవయ్యేళ్ళ విచారణ తర్వాత గానీ అతనిపై దేశద్రోహం ముద్ర తొలగిపోలేదు. సుప్రీం కోర్టు ఈ కేసులో కేరళ పోలీసుల పాత్ర అనుమానాస్పదంగా కనిపిస్తోందని వారందరిపై సీబీఐ విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయితే ఈ కేసులో నష్టపోయింది కేవలం నంబినారాయన్ ఒక్కరే కాదు. యావత్ భారత దేశం తీవ్రంగా నష్టపోయింది. ఈ కేసు విచారణ నడిచినంత కాలం క్రయోజనిక్ ఇంజిన్ డిపార్ట్‎మెంట్ హెడ్‎గా ఉన్న వ్యక్తి కాస్తా,.. అదే ఇస్రోలో చిన్న ఉద్యోగిగా పనిచేయాల్సి వచ్చింది. దీంతో భారత్‎ను అంతరిక్ష రంగంలో అగ్రపథాన నిలపాలన్న నంబి నారాయణన్ కల చెదిరిపోయింది. క్రయోజనిక్ టెక్నాలజీ విషయంలో భారత్ ఓ ఇరవయేళ్లు వెనుకబడిపోయింది. నంబి నారాయణన్ జీవిత చరిత్రపై ఇటీవల ఓ సినిమా కూడా వచ్చింది. ‘రాకెట్రీ : ది నంబి ఎఫెక్ట్’ పేరుతో ప్రముఖ నటుడు మాధవన్ చిత్రీకరించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‎గా నిలిచింది. అయితే, ఇదంతా ఇప్పుడెందుకు చెబుతున్నాననే కదా మీ అనుమానం. ఎందుకంటే, ఇస్రోలో మరో నంబి నారాయణన్ ఉదంతం జరుగుతోందనే అనుమానాలు వెలుగుచూశాయి. అప్పట్లో నంబినారాయన్ విషయంలో ఏదైతో జరిగిందో, సరిగ్గా అటువంటి సంఘటనలే మరో ఇస్రో సైంటిస్టు విషయంలో జరుగుతున్నాయట. ఈ విషయాన్ని ప్రముఖ ఇస్రో సైంటిస్ట్ ప్రవీణ్ మౌర్య బయటపెట్టారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారు..? ఇస్రోలో అసలు ఏం జరుగుతోంది..?

ఇటీవల ఇస్రో సైంటిస్టు ప్రవీణ్ మౌర్య తన ట్విట్టర్ ఖాతాలో సంచలన విషయాలను వెల్లడించాడు. ఈ పోస్టు ట్విట్టర్‎లో బాగా వైరల్ అయింది. తాను విదేశీ గూఢచారులకు బలైపోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తనను దుబాయ్ నుంచి కొందరు వ్యక్తులు సంప్రదించారని,.. వారు ఇస్రోలోని కీలక డాక్యుమెంట్లను అడుగుతున్నారని వెల్లడించాడు. ఈ డాక్యుమెంట్లను వారికి అందజేస్తే తనకు భారీగా డబ్బులు ఆశజూపారని కూడా తెలిపాడు. అయితే, దుబాయ్ గూఢచారులకు తాను ఆ పని చేయనని తెగేసి చెప్పినట్టు వెల్లడించాడు. ఇటువంటి వాటి కోసం మరోసారి తనను అస్సలు సంప్రదించవద్దని కోరినట్లు చెప్పాడు. అయితే ఆ దుబాయ్ వ్యక్తులు తనను వదల్లేదని తనపై అక్రమంగా కేసులు బనాయించారని ప్రవీణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై డ్రగ్స్ స్మగ్లింగ్ కేసును నమోదు చేయించారని పేర్కొన్నారు. అది కూడా రాత్రి పదిగంటల సమయంలో ఓ మైనర్ బాలికకు డ్రగ్స్ అమ్మినట్లు కేసు నమోదు చేయించారన్నారు. అయితే ఇస్రోలో సైంటిస్టుగా పని చేసే తనకు డ్రగ్స్ స్మగ్లింగ్ చేసే అవసరమేమొస్తుందని చెప్పుకొచ్చాడు. తాను కేరళలో పన్నెండేళ్ళుగా నివసిస్తున్నానని.. ఇప్పటివరకు తనపై ఒక్క కేసు కూడా లేదన్నాడు. అటువంటిది ఇప్పుడే కొత్తగా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఎలా వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాదు,.. ఈ దుబాయ్‎కి చెందిన వ్యక్తులకు ఇస్రోలోనే ఉన్నతాధికారులు సహాయపడుతున్నారనే సంచలన నిజాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. వారి సహాయంతోనే గూఢచారులు తనను కలిసారని చెప్పుకొచ్చాడు. వీరికి సహాయం చేస్తున్న వారిలో ఇస్రో మాజీ చైర్మన్‎కు దగ్గరి బంధువు కూడా ఒకరున్నారని తెలిపాడు. దీనిపై విచారణ చేపట్టాల్సిందిగా కేంద్ర దర్యాప్తు సంస్థలకు లేఖలు రాశానన్నాడు. ఇస్రో చైర్మన్‎కు, కేంద్ర హోం మంత్రి, ప్రధానితో పాటు ఇంటలిజెన్స్ బ్యూరోకు కూడా లేఖలు రాసినట్టు వెల్లడించాడు. దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరాడు.

మరోవైపు కేరళ పోలీసులపై కూడా ప్రవీణ్ అనుమానం వ్యక్తం చేశాడు. దుబాయ్ స్మగ్లర్లకు పోలీసులు సహాయం చేస్తున్నారనే సంచలన ఆరోపణలు చేశాడు. దీంతో మరోసారి కేరళ పోలీసుల తీరుపై అనుమానాలు వస్తున్నాయి. గతంలో కూడా నంబి నారాయన్ విషయంలో కేరళ డీజీపీనే కుట్రలో భాగస్వాములయ్యారని ఆరోపణలున్నాయి. ఒక సారయితే అప్పట్లో డీజీపీగా ఉన్న ‘సి.బి. మాథ్యూస్’ కూడా ఈ విషయాన్ని స్వయంగా ఒప్పుకున్నాడు. నంబి నారాయన్‎పై కేసు బనాయించాలని ఇంటలిజెన్స్ బ్యూరో కేరళ పోలీసులపై ఒత్తిడి తెచ్చిందని కూడా ఒప్పుకున్నారు. ఈ విధంగా గూఢచర్యం కేసులో కేరళ పోలీసుల పాత్రలపై గతంలో ఆరోపణల నేపథ్యంలో తాజాగా మరో సైంటిస్టు కూడా ఇటువంటి ఆరోపణలు చేశాడు.

అయితే తాజా గూఢచర్యం కేసులను ఇంటలిజెన్స్ అధికారులు త్వరితగతిన విచారించాల్సిన అవసరం ఉంది. ఇస్రో చరిత్రలో ఇటువంటి ఆరోపణలు చాలా అరుదు. అందుకే సైంటిస్ట్ ప్రవీణ్ మౌర్య చేసే ఆరోపణలను కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు పూర్తి స్థాయిలో విచారించాల్సిన అవసరం ఉంది. ప్రవీణ్ చేసిన ఆరోపణలు నిజమైతే ఆ దుబాయ్ వ్యక్తులెవరు..? వారికి సహాయం చేస్తున్న ఇస్రో సైంటిస్టులు, దీనికి సహాయపడుతున్న కేరళ పోలీసులెవరు..? అనే విషయాలపై సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే మరో నంబి నారాయణ్ ఉదంతం పునరావృతం కావొచ్చు. ఒకవేళ అదే జరిగితే విదేశీ కుట్రలకు మరో భారత సైంటిస్టుపై దేశ ద్రోహ ముద్ర పడుతుంది. దీంతో పాటు ఇప్పటికే ఇస్రోలో ఉన్న సైంటిస్టులకు తమను ఏ ప్రభుత్వమూ తమను కాపాడలేదనే అభద్రతా భావం ఏర్పడే ప్రమాదముంది. అందువల్ల ఇటువంటి గూఢాచారులు బెదిరించినప్పుడు వారికి సులభంగా లొంగిపోయి విలువైన సమాచారం ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి సంఘటనలేవీ జరగకుండా ఉండాలంటే సైంటిస్ట్ ప్రవీణ్ మౌర్య ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు త్వరితగతిన విచారణ జరిపి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

three × 4 =