Sports

48 గంటల్లో పాక్ తో ఇంగ్లండ్ సిరీస్.. ఇంగ్లండ్ బృందంలో ఏడుగురికి కరోనా

48 గంటల్లో పాకిస్తాన్-ఇంగ్లండ్ జట్లు సిరీస్ లో పాల్గొనబోతున్న సమయంలో ఇంగ్లండ్ బృందంలోని ఏడుగురు కరోనా పాజిటివ్ అని తేలింది. పాక్ తో జరగాల్సిన తొలి వన్డేకు రెండు రోజుల ముందే ముగ్గురు ఇంగ్లాండ్ ఆటగాళ్ళు, నలుగురు సహాయక సిబ్బంది కరోనా పాజిటివ్ అని తేలింది. జట్టు సభ్యులందరినీ ప్రస్తుతానికి వేరు చేసి ఐసోలేషన్ లో ఉంచారు. ఇలాంటి అవాంతరాలు వచ్చినా పాక్ తో సిరీస్ జరుగుతుందని అధికారిక ప్రకటనలో తేలింది. బెన్ స్టోక్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు ప్రకటించనున్నారు. క్రిస్ సిల్వర్‌వుడ్ జట్టుకు కోచ్‌గా తిరిగి వస్తాడని ధృవీకరించారు.

ఏడుగురు సభ్యులకు కరోనా సోకిందని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) ప్రకటించింది. పాకిస్థాన్ తో జరగబోయే రాయల్ లండన్ వన్డే సిరీస్, వైటాలిటీ టీ20 సిరీస్ కు ఎంపిక చేసిన జట్టులోని సభ్యులు కరోనా బారిన పడ్డారని వెల్లడించింది. ఇంగ్లండ్ ఆరోగ్య శాఖ, వేల్స్ ఆరోగ్యశాఖ, బ్రిస్టల్ లోని స్థానిక వైద్య ఆరోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణలో జులై 4 నుంచే జట్టు సభ్యులు క్వారంటైన్ లో ఉంటున్నారని, ప్రొటోకాల్ క్వారంటైన్ ప్రకారం వారంతా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉంటారని తెలిపింది. వారికి క్లోజ్ కాంటాక్ట్స్ అయిన మిగతా జట్టు సభ్యులకూ ఐసోలేషన్ లో ఉంచారు. ఈ జట్టుకు బెన్ స్టోక్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడని ఈసీబీ తెలిపింది. అంతకుముందు ఆటగాళ్లందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పింది. డెల్టా వేరియంట్ తో కరోనా కేసులు పెరుగుతున్నాయని ఈసీబీ సీఈవో టామ్ హారిసన్ అన్నారు. బయో సెక్యూర్ బబుల్ ను ఎంత పటిష్ఠంగా అమలు చేసినా కేసులు వస్తున్నాయని అన్నారు.

పాక్-ఇంగ్లండ్ జట్ల మధ్య జులై 8 నుండి జులై 20 వరకూ సిరీస్ జరగనుంది. మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ లు జరగనున్నాయి. మొదటి వన్డే గురువారం కార్డిఫ్ వేదికగా సాగనుంది. ఇంతలో కరోనా భయం సిరీస్ ను వెంటాడుతోంది. తక్కువ సమయంలో జట్టును సిద్ధం చేయడానికి ఈసీబీ బాగా కసరత్తులు చేస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

12 + 16 =

Back to top button