More

    పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు వరుస షాక్ లు..!

    పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు వరుస షాక్ లు తగులుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న ఆఖరి నిమిషంలో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సిరీస్ ను రద్దు చేసుకుని స్వదేశానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మరో క్రికెట్ బోర్డు కూడా తమ జట్టును అక్కడ అడుగుపెట్టనివ్వలేమని తెలిపింది. అన్నిటికీ కారణం సెక్యూరిటీ సమస్యలే..! పాకిస్తాన్ లో అడుగుపెడితే తమ ప్లేయర్స్ కు ఎటువంటి ఉపద్రవం కలుగుతుందోననే భయం క్రికెట్ బోర్డులను వెంటాడుతూ ఉంది. దీంతో ఆ దేశంలో క్రికెట్ సిరీస్ లు కష్టమేనని తేల్చి చెబుతూ ఉన్నాయి. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దిక్కుతోచని స్థితిలో ఉంది.

    ఇంగ్లండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సోమవారం నాడు పాకిస్తాన్ పర్యటన నుండి పురుషులు మరియు మహిళలు, జట్లు రెండింటినీ ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకునట్లు తెలిపింది. ఇటీవలే 18 సంవత్సరాల తర్వాత న్యూజిలాండ్ క్రికెట్ జట్టు పాకిస్తాన్‌లో అడుగుపెట్టింది. కానీ ఒక్క మ్యాచ్ ను కూడా ఆడకుండానే భద్రతా సమస్యలను చూపించి వెనుదిరిగింది.

    ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఇటీవలే సమావేశం నిర్వహించింది. పాకిస్తాన్‌కు వెళ్లకూడదని నిర్ణయం తీసుకుంది. కివీస్ పర్యటన రద్దు అయిన మూడు రోజుల తర్వాత ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సోమవారం ఈ నిర్ణయం ప్రకటించింది. ఇంగ్లండ్ జట్లు అక్టోబర్ 13, 14 తేదీలలో రావల్పిండిలో రెండు ట్వంటీ 20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మహిళల జట్టు అక్టోబర్ 17-21 వరకు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పాల్గొనాల్సి ఉంది. కానీ ఇవేవీ పాక్ లో నిర్వహించడం లేదు. “ఈ వారాంతంలో పాక్ లో ఇంగ్లండ్ మహిళలతోపాటు పురుషుల పర్యటన గురించి చర్చించడానికి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సమావేశమైంది. అక్టోబర్ నుంచి ఈ రెండు జట్ల పర్యటనను ఉపసంహరించుకోవాలని బోర్డు అయిష్టంగానే నిర్ణయించింది. మా క్రీడాకారులు, సహాయక సిబ్బంది భద్రతకే మా అత్యంత ప్రాధాన్యం. ఇది మరింత క్లిష్టమైనది. పాకిస్తాన్‌కు వెళ్లడం గురించి ఆందోళనలు పెరుగుతున్నాయని మాకు తెలుసు. ఇప్పటికే కోవిడ్ పరిస్థితుల్లో బయో బబుల్‌లో ఆటగాళ్లు ఎంతో శ్రమిస్తున్నారు. రానున్న సిరీస్‌ల కోసం ఆటగాళ్లను మరింత ఒత్తిడికి గురికి లోను కాకుండా చూడాల్సిన బాధ్యత బోర్డుపై ఉంది” అని ఈసీబీ తన ప్రకటనలో తెలిపింది.

    “తమ దేశంలో అంతర్జాతీయ క్రికెట్ తిరిగి ఆతిథ్యమివ్వడానికి అవిశ్రాంతంగా కృషి చేసిన పీసీబీకి ఈ నిర్ణయం నిరాశను కలిగిస్తుందని మాకు తెలుసు. ఇది పాకిస్తాన్‌లో క్రికెట్‌పై ప్రభావం చూపుతున్నందుకు చింతిస్తున్నాం. 2022 కోసం మా ప్రధాన పర్యటనలపై ఎంతో నిబద్ధతను కలిగి ఉన్నాం” అని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఇప్పటికే కివీస్ పాక్ లో పర్యటనను రద్దు చేసుకోవడంతో ఆర్థికంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డును బాగా దెబ్బ తీసింది. ఇప్పుడు ఇంగ్లండ్ జట్టు కూడా విరమించుకోవడంతో పాక్ క్రికెట్ బోర్డు ఎటూ తేల్చుకోలేని స్థితిలో నిలిచింది.

    2009 లో లాహోర్‌లో శ్రీలంక టీమ్ బస్సుపై ఇస్లామిస్ట్ మిలిటెంట్లు జరిపిన దాడిలో ఆరుగురు పోలీసులతో పాటు ఇద్దరు పౌరులు మరణించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అంతర్జాతీయ బృందాలు పాకిస్తాన్‌లో పర్యటించడానికి నిరాకరిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం రెండు దేశాలు పాక్ పర్యటనను రద్దు చేసుకోవడంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఆసీస్ పర్యటన డౌట్ గానే ఉంది. దీంతో మరోసారి పాకిస్తాన్ తమ సిరీస్ లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు షిఫ్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.

    Related Stories