Right Angle

సింహాల లోయలో తాలిబన్ల వేట..!

‘పంజ్ షేర్’ లోయగా ప్రసిద్ధి చెందిన ఐదు సింహాల యుద్ధమైదానం ప్రపంచాన్ని ఊపిరిసలపని ఉద్రిక్తతకు గురిచేస్తోంది. మహాసామ్రాజ్యాలను మట్టికరిపించిన ‘హిందూకుష్’ పర్వత శ్రేణులు తాజాగా పష్తూన్ తాలిబన్-పంజ్ షేర్ ముజాహిదీన్ ల మధ్య రణరంగానికి వేదికయ్యాయి. పంజ్ షేర్ లోయ అంత సులభంగా లొంగే ఘటం కాదు. యుద్ధతంత్రంలో ఆరితేరిన రష్యన్లను ముప్పుతిప్పలు పెట్టిన నేల అది. స్థిర, గెరిల్లా యుద్ధాలకు అనువైన భూభాగమది.

హిందూ కుష్ పర్వత సానువులు….ప్రపంచ చరిత్రలో ‘గ్రేట్ గేమ్’గా ప్రసిద్ధి కెక్కిన బ్రిటీష్-రష్యన్ సామ్రాజ్యాల మధ్య భయానక యుద్ధకాలాన్ని కళ్లారా చూశాయి. లెక్కలేని దండయాత్రల అనుభవాన్ని సొంతం చేసుకున్నాయి.

తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ ను తిరిగి  స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ‘పంజ్ షేర్’ ను మరోసారి యుద్ధ బెడద వెంటాడుతోంది. తాజిక్, ఘిల్జాయ్ పష్తూన్, హజారా, నూరిష్థానీ తెగల ప్రజలు అంతిమ యుద్ధం కోసం సన్నద్ధమవుతున్నారు. మంచుకురిసే హిమాలయ సొయగాల నిలయం పంజ్ షేర్ లోయలో రక్తమొలికినా, ప్రాణాలను ఫణంగా పెట్టి తాలిబన్ ముష్కరులను తరిమినా… అంతిమంగా యుద్ధం విషాదాన్నే మిగులుస్తుంది.

ఎందుకు పంజ్ షేర్ లోయ ఓటమిని ఇష్టపడదు? ఏ భౌగోళిక కారణాలు ఆ ప్రాంతాన్ని విజయతీరాలవైపు నడిపించాయి? పంజ్ షేర్ ధైర్యం వెనుక ఉన్న మతలబు ఏంటి? అహ్మద్ షా మసూద్ రష్యన్ బలగాలను ఎలా మట్టికరిపించాడు? యుద్ధతంత్రాన్ని సిద్ధాంతీకరించి, ఔరా! అనిపించుకున్న రష్యన్లు సింహాల లోయలో ఎలా బలయ్యారు?

అహ్మద్ షా మసూద్ గెరిల్లా ఎత్తుడగల స్వభావం ఏంటి? తాలిబన్లు చుట్టుముట్టిన నేపథ్యంలో పంజ్ షీర్ సైన్యం ఇతర దేశాల సహకారం లేకుండా విజయం సాధించగలదా? తాలిబన్లతో పోరులోకి దిగాలా? రాజీ మార్గాన్ని అనుసరించాలా…ఏది మెరుగైంది?

మార్క్ గెలియొట్టి రాసిన ‘‘The Panjshir Valley 1980–86: The Lion Tames the Bear in Afghanistan’’ పుస్తకంలో ఏముంది?

ఇలాంటి ప్రశ్నలకు జవాబులు వెతికే ప్రయత్నం చేద్దాం…

రష్యా సైనిక ఎత్తుగడలను అధ్యయనం చేసిన లండన్ కు చెందిన మార్క్ గెలియొట్టి ‘‘The Panjshir Valley 1980–86: The Lion Tames the Bear in Afghanistan’’ పేరుతో ఓ ఆసక్తికరమైన పుస్తకం రాశారు. పంజ్ షేర్ లోయ భౌగోళిక స్వరూపం ప్రత్యేకతలతో పాటు అహ్మద్ షా మసూద్ యుద్ధకౌశలాన్ని ఈ పుస్తకంలో సవివరంగా చర్చించాడు గెలియొట్టి. పష్తూన్, దురానీ తెగల సమాహారంగా ఉండే తాలిబన్ సైన్యానికీ, భిన్న తెగలు కలిసి ఉన్న పంజ్ షేర్ ఫైటర్లకు ఉన్న స్వాభావిక వైవిధ్యాలను చెపుతూ…ఈ భిన్నత్వం యుద్ధ స్వభావాన్ని ఎలా మారుస్తుందో విశ్లేషించారు.

పంజ్‌షిర్‌ ప్రజల్లో తెగింపు చాలా ఎక్కువ. అక్కడి ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని మరింతగా నింపిన నాయకుడు అహ్మద్‌ షా మసూద్‌. ఆయన మార్గదర్శకత్వంలో పంజ్‌షిర్‌ ప్రజలు తాలిబన్‌లకు వ్యతిరేకంగా పోరాడారు. 1970-80లలో సోవియట్‌ రష్యా దండయాత్రను తిప్పికొట్టడంతో పాటు.. 1996-2001లో తాలిబన్ల రాక్షస పాలనపై అవిశ్రాంత పోరాటం చేసిన గెరిల్లా కమాండర్ లలో అహ్మద్‌ షా పాత్ర కీలకమైనది. ఆయన కేవలం రాజకీయ నేత మాత్రమే కాదు.. మిలటరీ కమాండర్‌ కూడా.

అహ్మద్ షా మసూద్ ఇంజనీరింగ్ చదువుతున్న కాలంలో మావో సే టుంగ్, చేగెవెరా గెరిల్లా యుద్ధకళను అధ్యయనం చేసినట్టూ వెల్లడించారు. అయితే ఈ ఇద్దరు తాము అమలు చేసిన గెరిల్లా యుద్ధ సూత్రాల్లో చేగెవెరా ఆచరించినవి కాస్త సులభంగా ఉండటంతో పాటు సత్వర ఫలితాలు ఇస్తాయని తాను భావిస్తున్నట్టూ అహ్మద్ షా ఓ సందర్భంలో వెల్లడించినట్టూ ఈ పుస్తకం పేర్కొంది.

అయితే అహ్మద్ షా ప్రపంచ చరిత్రలోని విభిన్న గెరిల్లా యుద్ధ వ్యూహం-ఎత్తుగడలను అధ్యయనం చేయడంతో పాటు పంజ్ షేర్ లోయలోని భౌగోళిక ప్రత్యేకతలను, లోయలోని వివిధ తెగల యుద్ధ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పకడ్బందీ యుద్ధకళకు రూపం పోశారట. ఈ నూతన తరహా వ్యూహమే సోవియట్ సేనల ప్రాణాలను హరించాయని చరిత్ర చెపుతుంది.

ఆస్ట్రేలియాకు చెందిన రక్షణ వ్యవహారాల నిపుణుడు రిచర్డ్ మెకంజీ 1988, సెప్టెంబర్ సంచిక ‘ఎయిర్ ఫోర్స్’ మేగజైన్ లో ‘‘How did a band of ragtag tribesmen manage to defeat the Soviet Union in its own backyard?’’ అంటూ సోవియట్ – ఆఫ్ఘన్ యుద్ధంపై లోతైన పరిశీలనతో కూడిన వ్యాసం రాశారు.

సోవియట్ సేనలు 1979, డిసెంబర్ 6 నాటికి ప్రధాన ఫైటింగ్ బేస్ బర్గమ్ మీదుగా సలాంగ్ పర్వత శ్రేణిని దాటాయి. వైరిపక్షం పన్నిన ఉచ్చులోకి వెళుతున్న విషయాన్ని రష్యాబలగాలు ఊహించలేకపోయాయి. రిచర్డ్ మెకంజీ నాటి భయానక యుద్ధ సన్నివేశాన్ని వర్ణించారు..‘‘WATCHING Muslim rebels conceive, plot, and execute a classic guerrilla strike against Sovietbacked outposts in the remote Keran Valley, you get a close-up look at how the war is being won—and lost—in Afghanistan-మారుమూల కేరన్ లోయలో ముస్లీం తిరుగుబాటుదారులు వైరి రాకను ఊహించి, పథకాన్ని రచించి దాన్ని సమర్థవతంగా అమలు చేసి సోవియట్ సేనలను ఓడించిన తీరు గెరిల్లా దాడుల్లో అత్యంత ప్రామాణికమైంది. యుద్ధం జరుగున్న తీరును గమనిస్తే ఆఫ్ఘన్ యుద్ధ జయాజయాలు ఇట్టే రూపుగడుతున్నాయి’’ అన్నాడు.

అంతేకాదు, ‘‘In the meticulously planned assault, small units of highly motivated Muslim irregulars, fortified with reasonably good weapons and extraordinary intelligence data, surprise and utterly rout the heavily equipped but slow-footed and demoralized soldiers of the Afghan Army garrison’’-పకడ్బందీ పథక రచన, రక్షించుకోలిగే సామర్థ్యమున్న ఆయుధాలు, అంతకు మించి అసాధాణ నిఘా సమాచారంతో పాటు అంకితభావం కలిగిన ముస్లీం ఫైటర్లు చేసిన దాడిలో  ఆఫ్ఘన్ సేనలు హఠాత్పరిణామానికి గురయ్యాయి. విపరీతమైన బరువులు మోస్తూ నెమ్మదిగా కదులుతున్న నైతికస్థైర్యం కోల్పోయి…అచ్చంగా పలాయనం చిత్తగించాయి’’ అంటూ యుద్ధ తీవ్రతను చిత్రిక పట్టాడు.

తాను ముందుగానే పన్నిన ఉచ్చులోకి సోవియట్ సేనలు వచ్చేలా ఎత్తుగడ రచించిన అహ్మద్ షా మసూద్ అనుకున్న ప్రదేశానికి వైరి సైన్యం రాగానే గుక్కతిప్పుకోలేనిదాడికి ఆదేశించాడు. దీంతో రష్యా బలగాలు ఉచ్చులో చిక్కుకుని చనిపోవడమో, గాయాలతో పారిపోవడమో, లొంగిపోవడమో జరిగింది.

పంజ్ షేర్ ‘‘Topographical advantages’’ అహ్మద్ షా భీతిలేని స్వభావానికి కారణంగా చెపుతారు. ఎంత ఆధునాతన ఆయుధ సంపత్తిని అయినా అతి తక్కువ మందితో, తక్కువ సామర్థ్యమున్న మందుగుండుతో ఓడించడమనేది పంజ్ షేర్ లో మరింత సులభంగా సాధ్యమవుతుందంటారు సోవియట్ వ్యూహ పరిశీలకుడు మార్క్ గెలియొట్టి. పంజ్ షేర్ లోకి వెళ్లాలంటే పంజ్ షేర్ నది చీలిక వల్ల ఏర్పడిన ఏకైకదారి మాత్రమే ఉంది. ఇదే దాడులకు అనుకూలంగా మారింది.

రాబర్ట్ బౌమన్ రాసిన ‘‘Russian-Soviet Unconventional Wars in the Caucasus, Central Asia, and Afghanistan’’ పుస్తకంలో పంజ్ షేర్ లో రష్యా బలగాల ఓటమిపై టోపోగ్రఫీ ఎలాంటి ప్రభావం చూపిస్తుందో విశ్లేషించింది.

‘‘the most rugged areas of northern and eastern Afghanistan, posed distinct strategic and tactical problems for the Russians and Soviets. In particular, they restricted maneuver and increased the difficulties in sustaining regular, European-style forces’’-ఉత్తర, తూర్పు ఆఫ్ఘనిస్థాన్ లోని ఎత్తుపల్లాల యుధభూమి రష్యన్, సోవియట్ బలగాలకు వ్యూహాత్మక, ఎత్తుగడల సవాళ్లను విసరాయి. యూరోపియన్ తరహా యుద్ధకళలో ఆరితేరడం అనే పరిమితి ఓటమికి కారణమైంది.

మధ్య ఆసియా భౌగోళిక స్వరూపం రక్షణ వ్యూహాల్లో ఎలాంటి పాత్ర పోషిస్తుందో విశ్లేషిస్తూ…‘‘ ‘‘Nature, it may be said, constituted the predominant factor in centrel asian defenses’’- ‘మధ్య ఆసియా ప్రకృతి రక్షణ విధానంలో అత్యంత నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది’ అన్నాడు.

ఇదంతా తొంభయ్యవ దశకం నాటి మాట. నిరంతర యుద్ధాలు, ముఖ్యంగా ఆంగ్లో-ఆఫ్ఘన్ యుద్ధాలు, తర్వాత జరిగిన అనేక అంతర్యుద్ధాల కారణంగా రష్యా సేనలు దాడి చేసే నాటికి పంజ్ షేర్ ముజాహిదీన్ లకు అపారమైన యుద్ధ నైపుణ్యం, అనుభవం ఉన్నాయి. అహ్మద్ షా మసూద్ లాంటి సమర్థవంతమైన గెరిల్లా నాయకుడు ఉన్నాడు. నాటి రష్యా వ్యతిరేక యుద్ధంలో అమెరికా మద్దతు ఉంది. ఆయుధ సంపత్తి ఉంది. నిపుణులైన వ్యూహకర్తలు, సాహసవంతులైన కమాండర్లు ఉన్నారు.

పంజిషేర్ పరిస్థితి నేడు అందుకు భిన్నం. అమెరికా 2001లో ఆఫ్ఘనిస్థాన్ పై దాడిచేసిన తర్వాత గడచిన 20 ఏళ్లుగా పంజిషేర్ ప్రశాంతంగా ఉంది. రెండు దశాబ్దాలుగా లోయ యువత కొత్త భవిష్యత్తును నిర్మించుకుంటోంది. యుద్ధం చేస్తామన్న ధైర్యం ఉన్నవారి సంఖ్య మెరుగ్గానే ఉన్నా…తాలిబన్లతో పోరాడగలరా అనే సందేహాలూ ఉన్నాయి. సరిగ్గా ఇలాంటి సందర్భంలోనే అమెరికా పలాయనం, తాలిబన్ స్వాధీనం జరిగిపోయాయి. మరోవైపు తాలిబన్లు గత ఇరవై ఏళ్లుగా నిరంతర యుద్ధంలో మునిగి తేలారు. అనేక మంది యువకులను గెరిల్లా యుద్ధ నిపుణులుగా తీర్చిదిద్దింది.

పంజిషేర్ కు బయటిదేశాల మద్దతు కరువైంది. తాలిబన్లు లోయను చుట్టుముట్టారు. అహ్మద్ షా మసూద్ తనయుడు అహ్మద్ మసూద్ కు యుద్ధ అనుభవం లేదు. వ్యూహ రచన ఏమేరకు చేయగలడో తెలియదు. బలగాల సామర్థ్యంతో పాటు వ్యూహం-ఎత్తుగడలే యుద్ధం అంతిమ ఫలితాన్ని నిర్ణయిస్తాయి.

అయితే అహ్మద్ మసూద్ తో పాటు ఉన్న సమర్థుడైన గూఢచారి, నిఘావిభాగాల ఆనుపానులు తెలిసినవాడు, ధైర్యసాహసాలున్న ఆఫ్ఘన్ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సాలెహ ఉన్నాడు. సాలెహా గూఢచర్యం కారణంగానే అమెరికా అల్ ఖైదాను మట్టుబెట్టింది. బిన్ లాడెన్ ను గుట్టుచప్పుడు కాకుండా సంహరించింది. అంతేకాదు, ప్రపంచంలో అనేక దేశాల్లో అత్యంత రహస్యంగా దాక్కున్న తాలిబన్, ఆల్ ఖైదా నేతల ఉనికిని సీఐఏకి అందించింది కూడా సాలెహానే. సీఐఏకు అత్యంత నమ్మకమైన ఏజెంట్ అమ్రుల్లా సాలెహా.

ఆగస్ట్ 23 సాలెహా చేసిన ట్వీట్ ఆశ్చర్యానికీ, ఉత్కంఠకు గురిచేస్తోంది…‘‘Talibs have massed forces near entrance of panjshir a day after day they got trapped in ambush zones of in neighboring andarab valley and hardly went out in one piece. Mean while salang highway is closed by the forces of resistance. ‘‘there are terrains to be avoided’’ అంటూ హెచ్చరించారు. తాలిబన్ సేనలు మా ఉచ్చుల్లోకి క్రమంగా వస్తున్నాయి. జాగ్రత్త సుమా అంటూ విశ్వాసం నిండిన ప్రకటన చేశారు. ఒక వేళ నిజంగానే తాలిబన్ సేనలు పంజ్ షేర్ ముజాహిదీన్ ల ఉచ్చులో చిక్కుకుని భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోవచ్చు. అయితే మరో వెల్లువలా తాలిబన్లు పంజ్ షేర్ లోయను చుట్టుముడితే పరిస్థితి ఏంటన్నదే అహ్మద్ మసూద్, సాలెహాల ముందున్న సవాలు.

రాజీమార్గంలో వెళ్లి కొంతకాలం వ్యూహాత్మక లొంగుబాటు ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారో లేదో తెలియదు. బలమైన ముష్కరమూకతో పోరాడి ఓటమిపాలు కావాలా? దీర్ఘకాల దృష్టితో వ్యూహాత్మక రాజీ మార్గాన్ని అనుసరించాలా అంటే…మొదటి ప్రశ్నకు జవాబు ప్రజల ప్రాణాలతో ముడివడి ఉన్నఅంశం. రెండవ సవాలు కు స్పందించడం నైతిక సంశయానికి సంబంధించిన స్థితి. పంజ్ షేర్ ఈ యుద్ధాన్ని గెలవాలి. పంజ్ షేర్ లో తాలిబన్లపై తిరుగుబాటు ప్రకటించిన అహ్మద్ మసూద్ నేతృత్వంలోని ప్రతిఘటన కూటమి కూడా ముజాహిదీన్ తాత్వికతనే విశ్వసిస్తుంది. అయితే మహిళల విషయంలో కాస్త ఉదారతను ప్రదర్శిస్తుంది. యుద్ధంలో పంజ్ షేర్ గెలిస్తే…తాలిబన్ సేనల అకృత్యాలను ప్రశ్నించే ఒక భూమి హామీగా ఉందని అర్ధం.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

one × four =

Back to top button