More

    కాబూల్ పేలుళ్ల వెనుక ఉంది కూడా పాకిస్తానీనే..!

    ఆఫ్ఘనిస్తాన్ రాజ‌ధాని కాబూల్ ఎయిర్‌పోర్ట్ ద‌గ్గ‌ర గురువారం రెండు ఆత్మాహుతి దాడులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనకు బాధ్యులము తామేనని ఐసిస్ ప్రకటించింది. కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల జరిగిన ఈ ఆత్మాహుతి దాడిలో 12 మంది అమెరికా రక్షణ సిబ్బంది చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తొలుత విమానాశ్రయం వద్ద కొన్ని నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు జరగ్గా ఆ తర్వాత కొన్ని గంటలకు సెంట్రల్ కాబూల్‌లో మరో పేలుడు సంభవించింది. ఈ పేలుళ్లకు పాల్పడింది తామేనని తాజాగా ప్రకటించిన ఐసిస్ అబే గేటు వద్ద జరిగిన పేలుడుకు సంబంధించి ఆత్మాహుతి బాంబర్ ఫొటోను కూడా విడుదల చేసింది.

    అయితే ఈ దాడుల కుట్ర వెనుక ఓ పాకిస్థానీ హ‌స్తం ఉన్న‌ట్లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఐసిస్ పాకిస్తాన్ హెడ్ అయిన ఎమిర్ మ‌వాల‌వీ అబ్దుల్లా ఫ‌రూఖీయే ఈ దాడుల్లో కీల‌క‌పాత్ర పోషించిన‌ట్లు ఆఫ్ఘ‌న్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఫ‌రూఖీకి గ‌తంలో ల‌ష్క‌రే తోయిబా, తెహ్రీకే తాలిబ‌న్‌ల‌తో లింక్స్ ఉన్నాయి. 2019, ఏప్రిల్‌లో ఇస్లామిక్ స్టేట్ పాకిస్థాన్ హెడ్‌గా మ‌వాల‌వి జియావుల్ హ‌క్ అలియాస్ అబు ఫ‌రూఖీ ఖోర్సానీ స్థానంలో ఫ‌రూఖీ నియ‌మితుడ‌య్యాడు. 2020లో కాబూల్ గురుద్వారాలో జ‌రిగిన పేలుడులో ఇత‌డే ప్ర‌ధాన సూత్ర‌ధారి. పాకిస్తానే ఈ పేలుళ్ల‌కు కార‌ణ‌మ‌నీ.. తానే దీనికి బాధ్యుడినని ఫ‌రూఖీ చెప్పాడు. కాబూల్ జైల్లో ఉన్న ఇత‌న్ని తాలిబాన్లు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఇత‌ర ఉగ్ర‌వాదుల‌తో క‌లిపి విడిచిపెట్టారు. అతడే ఈ కాబూల్ ఎయిర్‌పోర్ట్ ద‌గ్గ‌ర ఆత్మాహుతి దాడుల‌కు ప్లాన్ చేసిన‌ట్లు ఆఫ్ఘ‌న్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

    పేలుళ్ల‌కు పాల్ప‌డింది ఐఎస్ఐఎస్-ఖొరోస‌న్ అని చెప్పుకొంది. ఐఎస్ ఖొరోస‌న్ ప్రాంతీయ ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర ద‌ళం. 2011 నుంచి ఇప్ప‌టి వర‌కు ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ఒకే రోజు అమెరికా ద‌ళాలు అత్య‌ధిక సంఖ్య‌లో త‌మ సైనికుల్ని కోల్పోవడం ఇదే మొదటిసారి. 2014లో ఇరాక్‌, సిరియా దేశాల్లో ఇస్లామిక్ స్టేట్ క‌లిఫా ప్ర‌క‌టించిన కొన్ని నెల‌ల్లోనే పాక్ తాలిబాన్లు, ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ఉన్న ఉగ్ర‌వాదులతో చేతులు క‌లిపారు. వాళ్లంతా క‌లిసి ప్రాంతీయ‌ ద‌ళంగా ఏర్ప‌డ్డారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌నేత అబూ బాక‌ర్ అల్ బాగ్దాది ఆదేశాల మేర‌కే వాళ్లు ప‌నిచేస్తున్నారు. ఆఫ్ఘ‌న్‌లోని ఈశాన్య ప్రాంతాలైన కునార్‌, నాన్‌గ‌ర్‌హ‌ర్‌, నురిస్తాన్ ప్రావిన్సుల్లో ఖ‌రోస‌న్ గ్రూపు ప‌ట్టు సాధించింది. దీంతో ఆ గ్రూపుకు ఐఎస్ఐఎస్ కేంద్ర నాయ‌క‌త్వానికి ద‌గ్గ‌రైంది. పాక్, ఆఫ్ఘ‌నిస్తాన్ దేశాల్లో ఐఎస్-ఖ‌రోస‌న్ గ్రూపు త‌న‌కు చెందిన స్లీప‌ర్ సెల్స్‌ను ఏర్పాటు చేసింది. కాబూల్‌లో కూడా ఆ స్లీప‌ర్ సెల్స్ ఉన్నాయి. ఐఎస్-ఖ‌రోస‌న్ గ్యాంగ్‌లో వేలాది మంది ద‌ళ స‌భ్యులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. యూఎన్ భ‌ద్ర‌తా మండ‌లి నివేదిక‌లు ఈ విష‌యాన్ని చెబుతున్నాయి. ఆఫ్ఘ‌న్ ప్రాంతానికి ఉన్న చారిత్రాత్మ‌క పేరే ఖ‌రోస‌న్‌. ప్ర‌స్తుతం ఉన్న పాకిస్థాన్‌, ఇరాన్‌, ఆఫ్ఘ‌నిస్తాన్‌, సెంట్ర‌ల్ ఏషియా ఆ ప్రాంతం కింద‌కు వ‌స్తాయి. వీరు రాబోయే రోజుల్లో మరిన్ని దాడులకు పాల్పడుతారని నిఘా వర్గాలు హెచ్చరిస్తూ ఉన్నాయి.

    Trending Stories

    Related Stories