సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారే ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ సైతం కష్టాలు తప్పడం లేదు. ఎలన్ మస్క్ కు వ్యతిరేకంగా కొడుకు కోర్టుమెట్లెక్కడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎలాన్ మస్క్ ట్రాన్స్‌జెండర్ కుమార్తె తన పేరును మార్చడానికి పిటిషన్ దాఖలు చేసింది.
తాను ఇకపై తన పుట్టుకకు కారణమైన తండ్రితో ఏ విధమైన సంబంధంతో గానీ, పేరుతో గానీ జీవించాలనుకోవడం లేదని పిటిషన్ లో పేర్కొంది. పేరు మార్పు, కొత్త లింగ గుర్తింపును సూచించే కొత్త బర్త్ సర్టిఫికేట్ రెండింటి కోసం ఏప్రిల్‌లో శాంటా మోనికాలోని లాస్ ఏంజిల్స్ కౌంటీ సుపీరియర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అది కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎలాన్ మస్క్ మొదటి భార్య కెనడా నటి జస్టిన్ విల్సన్. 2000 సంవత్సరంలో జస్టిన్ను మస్క్ వివాహం చేసుకుని ఎనిమిదేళ్ల తర్వాత విడాకులు ఇచ్చాడు. ఈ ఇద్దరికీ ఆరుగురు సంతానం. తొలి దఫాలో ఐవీఎఫ్ ద్వారా కవలలను కంది జస్టిన్. ఇందులో ఒకడే గ్జావియర్ అలెగ్జాండర్ మస్క్. ఇక విడాకుల తర్వాత తల్లిదండ్రులు పిల్లల సంరక్షణను సమానం చూస్తున్నారు. అయితే గ్జావియర్ అలెగ్జాండర్ మస్క్ ట్రాన్స్‌జెండర్. సర్జరీ ద్వారా అమ్మాయిగా మారిపోయాడు. వివియన్ జెన్నా విల్సన్‌గా పేరు మార్చుకున్నాడు. తాజాగా 18 ఏళ్లు నిండడంతో ఎలాన్ మస్క్‌తో తనకు సంబంధాలు వద్దంటూ కోర్టుకు ఎక్కింది.
తాను ఇకపై ఏ విధంగా, ఆకారం, రూపం, గుర్తింపులో.. కన్నతండ్రి నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నానని పిటిషన్ పేర్కొంది. ఆయన గుర్తింపు ఇకపై తనకు అక్కర్లేదని స్పష్టం చేసింది. తన పేరు మార్పిడికి అనుమతించండని కోర్టును కోరింది. తన లింగమార్పిడికి చట్టబద్ధత ఇవ్వండి అంటూ.. శాంటా మోనికాలోని లాస్ ఏంజెల్స్ కౌంటీ సుపీరియర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే.. ఏప్రిల్ నెల చివర్లోనే వివియన్ తన పిటిషన్ దాఖలు చేసింది. కానీ, అందులోని ఆసక్తికర వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి.
కాలిఫోర్నియాలో ఉంటున్న గ్జావియర్ అలెగ్జాండర్ మస్క్ తన కొత్త పేరుకు అధికారిక గుర్తింపు ఇవ్వడంతో పాటు కన్నతండ్రి ఎలాన్ మస్క్ గుర్తింపును, ఆయన అందించే సాయాలను రద్దు చేయాలని పిటిషన్లో తెలిపింది. తండ్రి నీడలో బతకడం ఇష్టం లేదంటూ పిటిషన్లో పేర్కొంది వివియన్. ఇదిలా ఉంటే.. ఆ తండ్రి, ట్రాన్స్‌జెండర్ కూతురు మధ్య గొడవ ఏంటన్నదానిపై స్పష్టత లేదు. ఇరు పక్షాల లాయర్స్ సైతం దీనిపై స్పందించలేదు. మరోవైపు ట్రాన్స్‌జెండర్ హక్కుల విషయంలో రిపబ్లికన్ పార్టీకి మద్దతు ప్రకటించాడు ఎలాన్ మస్క్. తాజా చట్టం ప్రకారం అమెరికాలో ట్రాన్స్‌జెండర్ హక్కులపై పరిమితులు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో తండ్రి వైఖరిపై అసంతృప్తితోనే గ్జావియర్ అలియాస్ వివియన్ ఇలా పిటిషన్ వేసి ఉంటుందని భావిస్తున్నారు.
ఇక గతేడాదే ఎలన్ రెండో భార్యకు రెండో సంతానం పుట్టింది. ఎలాన్ మాస్క్, గ్రిమ్స్‌కు రెండో సంతానంగా పాప పుట్టింది. వారిద్దరి మొదటి సంతానమైన కుమారుడికి విచిత్రమైన పేరు పెట్టినట్టే.. కూతురికి కూడా అలాంటి పేరునే పెట్టారు. సరోగసి పద్ధతిలో గత డిసెంబరులోనే ఈ పాప పుట్టినా.. గత రెండు నెలల వరకు రహస్యంగా ఉంచారు. మార్చిలో ఆ పాపకు ఎక్సా డార్క్ సైడరాయెల్ మస్క్‌గా నామకరణం చేశారు. అంతేకాదు.. ఆ పాపను మస్క్ దంపతులు ముద్దుగా ‘వై’ అని పిలుస్తారట. సోషల్ మీడియాలో ఈ విషయమై జోరుగా చర్చ జరిగింది. కుమారుడి పేరును ముద్దుగా ఎక్స్ అని పిలుచుకునే మస్క్ దంపతులు.. కూతురిని ముద్దుగా వై అని పిలుచుకోవడంపైనా ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఇంగ్లీష్ అల్ఫా బెట్లలో ఎక్స్ తరువాత వచ్చేది వై.. కదా.. అని అందుకే అలా పిలుస్తున్నారేమో అంటూ చర్చించుకున్నారు.