మస్క్ గూటికి ట్విటర్ పిట్ట..!

0
732

మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్నాడు. కొద్దిరోజుల కిందట ట్విట్టర్‌లోని 9.2 శాతం వాటాను కొనుగోలు చేసిన మస్క్ ఇప్పుడు సంస్థ మొత్తం షేర్లను కొనుగోలు చేశారు. ఒక్కో షేర్‌కు 54.20 డాలర్ల చొప్పున సంస్థలోని మొత్తం షేర్లను 46.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసి ట్విట్టర్‌ను తన వశం చేసుకున్నారు. ఇక వాక్ స్వాతంత్ర్యానికి మరింత అనువైన వేదికగా ట్విట్టర్‌ను తీర్చిదిద్దుతానని ప్రకటించారు. ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం వార్తల నేపథ్యంలో ట్విట్టర్ షేర్ ధర 3 శాతం పెరిగింది. ట్విట్టర్ కొనుగోలుకు అవసరమైన నిధులను బ్యాంకుల ద్వారా మస్క్ సమకూర్చుకున్నారు. ఇక ట్విట్టర్‌ను ‘హేట్ స్పీచ్’కు వేదికగా మార్చొద్దని పలువురు కోరారు. ఎలాన్ మస్క్ -ట్విట్ట‌ర్ కొనుగోలు ఒప్పందం గురించి ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ కీలక ప్రకటన చేశారు. ‘ట్విట్టర్‌ మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేయగల సంస్థ. మా టీమ్ స‌భ్యుల‌ ప‌ట్ల‌ చాలా గర్వంగా ఉంది. ఇంతకు ముందు ఎన్నడూ లేనంతగా ప్రేరణ కలిగించగలదు’అని పేర్కొన్నారు.