ఫీలింగ్స్ అన్నవి కేవలం మనుషులకు మాత్రమే కాదు.. మూగజీవాలకు కూడా ఉంటాయి. తమను పెంచిన వ్యక్తి ఆసుపత్రిలో ఉంటే కొన్ని రోజుల పాటూ ఎదురుచూసిన కుక్కలు.. తనను కాపాడిన ఓ వ్యక్తిని కలవడానికి ప్రతి ఏడాది వచ్చే పెంగ్విన్.. ఇలా మనుషులతో మూగజీవాలకు కూడా ఎనలేని బాండింగ్ అన్నది ఎప్పటి నుండో ఏర్పడి ఉంది. ఇక తుది వీడ్కోలు పలికే సమయంలో మనుషులు ఎంతగా బాధ పడుతారో.. అంతకు మించి జంతువులు కూడా బాధపడతాయని చాలా సార్లు రుజువైంది.
తాజాగా మరో ఘటన అలాంటిదే చోటు చేసుకుంది. చనిపోయిన తన మావటిని కడసారి చూసేందుకు గజరాజు వచ్చాడు. తనను ఒకప్పుడు పాలించిన వ్యక్తి విగతజీవుడిలా పడివుండడాన్ని ఆ ఏనుగు కూడా సహించలేకపోయింది. ఆ మావటిని పిలుస్తున్నట్టుగా తొండం పైకెత్తి పలుమార్లు హావభావాలు ప్రదర్శించింది. మావటి కుటుంబ సభ్యులు ఏనుగును చూసి మరింత బాధ పడ్డారు. ఈ ఘటన కేరళలోని కొట్టాయంలో చోటుచేసుకుంది. కున్నక్కడ్ దామోదరన్ నాయర్ 74 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఓమన్ చెట్టన్ అని పిలవబడే ఆయన గత 6 దశాబ్దాలుగా ఏనుగుల సంరక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఏనుగు పేరు పాల్ఘాట్ బ్రహ్మదత్తన్. ఓమన్ చెట్టన్ కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతూ కన్నుమూయడంతో విషయం తెలుసుకున్న ఆ గజరాజును దాని యజమాని మావటి ఇంటికి తీసుకువచ్చారు. అప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది.