విజయవాడలో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి ఓ వ్యక్తి మృతి

0
736

ఏపీలోని విజయవాడలో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి ఓ వ్యక్తి మృతి చెందాడు. సూర్యారావుపేటలోని గులాబీపేటకు చెందిన శివకుమార్ అనే వ్యక్తి కొత్తగా ఎలక్ట్రిక్ బైక్ ను కొనుగోలు చేశాడు. బైక్ బ్యాటరీని రాత్రి బెడ్రూంలో చార్జింగ్ పెట్టి కుటుంబం మొత్తం నిద్రకు ఉపక్రమించింది. తెల్లవారుజామున భారీ శబ్దంతో బ్యాటరీ పేలిపోయింది. ఇల్లు మొత్తానికి మంటలు అలముకున్నాయి. దీంతో ఆ ఇంటి నుండి కేకలు వినిపించాయి. మంటల్లో ఇరుక్కున్న వారి కుటుంబాన్ని ఇరుగుపొరుగు వారు రక్షించారు. తీవ్రగాయాలైన వాళ్లను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో శివకుమార్ మరణించాడు. అతడి భార్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

స్థానికులు మాట్లాడుతూ.. “గులాబీపేటకు చెందిన శివకుమార్‌ నిన్ననే కొత్త CORBETT14 ఎలక్ట్రిక్ బైక్‌ కొనుగోలు చేశాడు. అనంతరం ఇంట్లోని బెడ్‌రూమ్‌లో బైక్‌ బ్యాటరీకి ఛార్జింగ్‌ పెట్టాడు.. ఈ క్రమంలో తెల్లవారుజామున బ్యాటరీ పేలి ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి” అని తెలిపారు. శివ కుమార్ ఇద్దరు పిల్లలకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. పిల్లలను మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు.

కొద్దిరోజుల కిందట వైజాగ్‌లో బ్యాటరీ పేలి ఓ ఎలక్ట్రిక్ బైక్ షోరూం దగ్ధమవ్వగా.. ఇటీవలే నిజామాబాద్ జిల్లాలో బైక్ బ్యాటరీ పేలి ఒకరు ప్రాణాలు కోల్పోగా కుటుంబంలో మిగిలిన వారికి తీవ్రగాయాలయ్యారు. పెట్రోల్ ధరల నుండి విముక్తులు అవ్వడానికి ఎలెక్ట్రిక్ బైక్స్ కొంటూ ఉంటే బ్యాటరీలు పేలడాలు, బైక్స్ తగలబడడాలు కొత్త టెన్షన్ ను తెస్తున్నాయి.