ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వాయిదా

0
761

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు విషయంలో మార్పులు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 14 న ఎన్నికలు జరగాల్సి ఉండగా పంజాబ్ సీఎంతో పాటు పలు రాజకీయ పార్టీల అభ్యర్థన మేరకు ఈసీ నిర్ణయం తీసుకుంది.

ఫిబ్రవరి 14న జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీని మారుస్తున్నట్లు తెలిపింది. పంజాబ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 20న పోలింగ్‌ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. సంత్ రవిదాస్ జయంతి కారణంగా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల తేదీని మార్చాలని డిమాండ్ చేశాయి. పోలింగ్ తేదీని వారం రోజుల పాటు ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఫిబ్రవరి 16వ తేదీ శ్రీ గురు రవిదాస్ జీ జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. పంజాబ్ రాష్ట్రం నుండి పెద్ద సంఖ్యలో భక్తులు బనారస్ వెళతారు. దీని కారణంగా పోలింగ్‌ శాతం భారీగా తగ్గే అవకాశముందని పలు రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. భారతీయ జనతా పార్టీ, కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ, సుఖ్‌దేవ్ సింగ్ ధిండాకు చెందిన శిరోమణి అకాలీదళ్ (యునైటెడ్) కూడా ఎన్నికల సంఘం తేదీని పొడిగించాలని డిమాండ్ చేశాయి. దీంతో ఎన్నికల సంఘం పోలింగ్ తేదీని మారుస్తూ నిర్ణయం తీసుకుంది.

పంజాబ్ ఎన్నికల ప్రక్రియకు కొత్త తేదీలు
నోటిఫికేషన్ తేదీ: 25 జనవరి 2022 (మంగళవారం)
నమోదుకు చివరి తేదీ: 1 ఫిబ్రవరి 2022 (మంగళవారం)
పరిశీలన తేదీ: 2 ఫిబ్రవరి 2022 (బుధవారం)
ఉపసంహరణ తేదీ: 4 ఫిబ్రవరి 2022 (శుక్రవారం)
పోలింగ్ తేదీః 20 ఫిబ్రవరి 2022 (ఆదివారం)
ఓట్ల లెక్కింపుః 10 మార్చి 2022 (గురువారం)