ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు విడుదల.. ఉత్తరప్రదేశ్ లో ఏడు దశల్లోనూ పోలింగ్

0
717

ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసన సభ ఎన్నికల షెడ్యూలును ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఐదు రాష్ట్రాల్లో 7 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 10న జరిగే తొలిదశ పోలింగ్ తో ఎన్నికలు మొదలు అవుతాయి. ఫిబ్రవరి 14న రెండో దశ, ఫిబ్రవరి 20న మూడో దశ, ఫిబ్రవరి 23న నాలుగో దశ, ఫిబ్రవరి 27న ఐదో దశ, మార్చి 3న ఆరో దశ, మార్చి 7న ఏడో దశ పోలింగ్ జరగనుంది. 403 స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్ లో ఏడు దశల్లోనూ పోలింగ్ జరగనుంది. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో ఫిబ్రవరి 14న ఎన్నికలు జరుగుతాయి. మణిపూర్ లో ఫిబ్రవరి 23, మార్చి 3 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ ఉంటుంది. ఉత్తర ప్రదేశ్‌లో 403, ఉత్తరాఖండ్‌లో 70, పంజాబ్‌లో 117, గోవాలో 40, మణిపూర్‌లో 60 శాసన సభ స్థానాలు ఉన్నాయి. కోవిడ్-19 మహమ్మారి పరిస్థితులను సమీక్షించిన అనంతరం ఎన్నికల కమిషన్ ఈ రాష్ట్రాల్లో ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించింది. చీఫ్‌ ఎన్నికల ఆఫీసర్‌ సుశీల్‌ చంద్ర మాట్లాడుతూ మొత్తం ఐదు రాష్ట్రాల్లో 690 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఈ ఐదు రాష్ట్రాల్లో 18.34 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నందున కోవిడ్‌ సేఫ్‌ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. అభ్యర్థులు నేర చరిత్రను పార్టీలన్నీ తమ వెబ్ సైట్లలో హోం పేజిలో ఉంచాలి. అభ్యర్థిని ఎంపిక చేసిన 24 గంటల్లో నేరచరిత్ర వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని తెలిపారు. తాజా నిర్ణయంతో ఐదు రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్‌ వచ్చింది. ఐదు రాష్ట్రాలకుగానూ 900 మంది ఎలక్షన్‌ అబ్జర్వర్లను నియమించారు. యూపీ, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లో అభ్యర్థులు రూ.40లక్షలు ఎన్నికల వ్యయం చేసేందుకు అవకాశమిచ్చారు. గోవా, మణిపూర్‌లో ఈ వ్యయం రూ.28లక్షలుగా నిర్ణయించారు. డబుల్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నవారే ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. కోవిడ్‌ సోకిన వాళ్లకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించారు. రాజకీయ పార్టీలు జనవరి 15వరకు రోడ్ షోలపై నిషేదం విధించారు. పాదయాత్రలు, సైకిల్, బైక్ ర్యాలీలపై నిషేధం విధించారు. రాజకీయ పార్టీలు ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదని తెలిపారు. జనవరి 14న యూపీలో తొలిదశ నోటిఫికేషన్‌ విడుదల అవుతుంది. మార్చి 10న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదలవ్వనున్నాయి. ఈ ఎన్నికలను పలు పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రస్తుతం పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలు ఉన్నాయి. పంజాబ్‌లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఉంది.