కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ప్రధాన పార్టీలకు జాతీయ హోదా రద్దు..!

0
508

కేంద్ర ఎన్నికల సంఘం పలు పార్టీలకు షాకిచ్చింది. సీపీఐ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీలకు జాతీయ పార్టీ హోదా రద్దు చేసింది. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా కల్పిస్తున్నట్లు ప్రకటన వెలువడింది. సీపీఐ ఒకప్పుడు జాతీయ పార్టీగా నిలిచినా ఇప్పుడు ఎన్నో రాష్ట్రాలలో కనుమరుగు అయిపోయింది. ఇక తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి పశ్చిమ బెంగాల్ లో తప్ప మిగిలిన ఏ రాష్ట్రాల్లో కూడా సరైన ప్రాధాన్యత లేదు. ఎన్సీపీ ఇటీవలి కాలంలో పూర్తిగా చతికిలపడిపోయింది. కానీ ఆప్ మాత్రం ఎదుగుతూ వస్తోంది. ఢిల్లీలోనే కాకుండా పంజాబ్ రాష్ట్రంలో కూడా అధికారంలో ఉంది. గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో కూడా కొద్దిగా తమ ప్రభావాన్ని చూపిస్తోంది. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చగా.. ఆ పార్టీకి కూడా ఈసీ షాకిచ్చింది. ఏపీలో బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ గుర్తింపును తొలగించింది. బీఆర్ఎస్ తెలంగాణలో మాత్రమే రాష్ట్ర పార్టీగా కొనసాగుతుందని ఈసీ వెల్లడించింది. ఎలక్షన్ సింబల్స్ ఆర్డర్, 1968లోని పారా 6 ప్రకారం ఈసీ తాజా నిర్ణయం తీసుకుంది.

జాతీయ హోదా కోల్పోవడం అనేది పెద్ద విషయమే కాదని, కానీ ఎన్నికల సంఘం నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తామని తృణమూల్ పార్టీ వర్గాలు తెలిపాయి. యూపీలో రాష్ట్రీయ లోక్ దళ్, పశ్చిమ బెంగాల్‌లో రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీలకు రాష్ట్ర పార్టీ హోదా రద్దు అయింది. త్రిపురలో తిప్రా మోతా పార్టీకి, మేఘాలయలో వాయిస్ ఆఫ్ ది పీపుల్స్ పార్టీకి, నాగాలాండ్‌లో లోక్ జనశక్తి పార్టీకి రాష్ట్ర పార్టీలుగా గుర్తింపు లభించింది.