మహారాష్ట్ర సీఎంగా శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు గ్రూపు నాయకుడు ఏక్‌నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు, షిండే దివంగత బాలాసాహెబ్ ఠాక్రేను గుర్తు చేసుకున్నారు.
దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నుంచి వచ్చిన ఈ ప్రతిపాదనకు ఫడ్నవీస్ తొలుత అంగీకరించలేదు. షిండేనే సీఎంగా ఉంటారని తానే ప్రకటించానని, అంతేకాకుండా షిండే సర్కారుకు బీజేపీ బయటి నుంచి మద్దతు ఇస్తుందని ప్రకటించానని నడ్డాకు ఫడ్నవీస్ వివరించారు. అయితే పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం మేరకు డిప్యూటీ సీఎంగా చేరాల్సిందే అంటూ ఫడ్నవీస్‌కు నడ్డా సూచించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సర్దిచెప్పడంతో డిప్యూటీ సీఎంగా ఉండేందుకు ఫడ్నవీస్ అంగీకరించారు.