ఈజిప్టు రాజధాని కైరో నగరంలో ఓ చర్చిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 41 మంది దుర్మరణం పాలయ్యారు. అబు సిఫైనే చర్చిలో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బయటకు రాలేకపోయిన చాలా మంది సజీవదహనమయ్యారు. పదుల సంఖ్యలో మృతి చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ తీవ్రంగా శ్రమించి మంటలను అదుపుచేసింది. ఈ ఘటనపై ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటన స్థలంలో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలంటూ ప్రభుత్వ శాఖలను ఆదేశించారు. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదని చర్చి వర్గాలు వెల్లడించాయి.
మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు కొందరు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయారని.. విపరీతమైన వేడి, దట్టమైన పొగ కారణంగా పలువురు ఊపిరాడక చర్చిలోనే పడిపోయారు. ఈజిప్టు కాప్టిక్ చర్చి, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంటల్లో 41 మంది చనిపోయారని.. 14 మంది గాయపడ్డారని తెలిపారు. ఎమర్జెన్సీ బృందం మంటలను అదుపులోకి తెచ్చారని స్థానికులు చెప్పారు.