More

  శివసేనకు మరో ఎదురుదెబ్బ.. సంజయ్ రౌత్‎కు ఈడీ సమన్లు..!

  మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సినిమాను తలపించే విధంగా ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతున్నాయి. రెండు వర్గాలు విడిపోయిన శివసేన తమ పంతాలు నెగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.

  ఇదిలా ఉంటే సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఎంపీ సంజయ్ రౌత్‎కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. జూన్ 28న విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. ముంబైలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని కోరింది. అయితే అసంతృప్త నేతలపై సంజయ్ రౌత్ హార్ట్ కామెంట్స్ చేస్తున్నారు. దమ్ముంటే ముంబయి రావాలని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో సంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు ఇవ్వడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో మహావికాస్ అఘాడీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు కావడానికి, ప్రస్తుతం సంక్షోభ పరిస్థితుల్లో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. పత్రచల్ భూముల వ్యవహారంలో కుంభకోణానికి పాల్పడినట్లు సంజయ్ రౌత్ పై ఆరోపణలు ఉన్నాయి. రూ.1,043 కోట్లు విలువైన పాత్రచాల్​ భూకుంభకోణంలో సంజయ్​ రౌత్​ భార్య వర్షా రౌత్​, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ.11.15 కోట్లు విలువ చేసే ఆస్తులను ఏప్రిల్​లో ఈడీ జప్తు చేసింది. ఆయన సామ్నా పత్రిక బాధ్యతలను కూడా చూస్తున్నారు.

  ఇక ఈడీ సమన్లపై సంజయ్ రౌత్ స్పందించారు. తనకు ఇప్పటికీ నోటిసులు అందలేదని.. నోటీసులు అందిన తర్వాత మాట్లాడుతానని.. అయినా మంగళవారం తనకు వేరే పనులు ఉన్నాయని అన్నారు. ఇదిలా ఉంటే మరోవైపు గౌహతి, ముంబై కేంద్రంగా రాజకీయం మారుతోంది. ఏక్ నాథ్ షిండే తన వర్గం ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేయడంతో పాటు అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ గా అజయ్ చౌదరిని నియమించడంపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తమకు 38 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ఎంవీఏ ప్రభుత్వం మైనారిటీలో పడిందని కోర్టుకు ఇచ్చిన పిటిషన్ లో షిండే తెలిపారు. ఎంవీఏ సర్కార్ కు మద్దతు ఉపసంహరించుకునే యోచనలో షిండే గ్రూప్ ఉంది. ఎమ్మెల్యేల సంతాకాలతో మహారాష్ట్ర గవర్నర్ కు షిండే వర్గం లేఖ రాసింది. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయాలని గవర్నర్ ను కోరారు. అయితే రాజకీయ వేధింపుల చర్యల్లో భాగంగానే బీజేపీ రౌత్ ను టార్గెట్ చేసిందని శివసేన నేతలు ఆరోపిస్తున్నారు.

  ఇదిలా ఉంటే ఏక్ నాథ్ షిండేను శివసేన ఫ్లోర్ లీడర్ గా తొలగించి అజయ్ చౌదరిని నియమించింది శివసేన. తాజాగా ఈ నియామకానికి డిప్యూటీ స్పీకర్ ఆమోదం తెలిపాడు. ఇప్పటికే సీఎం ఉద్ధవ్ ఠాక్రే సిఫారసు మేరకు డిప్యూటీ స్పీకర్ 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. ఇదిలా ఉంటే రెబెల్ వర్గానికి షాక్ ఇచ్చాడు సీఎం ఉద్ధవ్ ఠాక్రే. ప్రస్తుతం రెబెల్ వర్గంలో ఉన్న ఎనిమిది మంది మంత్రుల శాఖలను తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నాడు. మహారాష్ట్రలో భారీ వర్షాలు, తుఫాన్ ముప్పు ఉండటంతో అందుబాటులో లేని 8 మంది మంత్రుల శాఖలను తొలగించినట్లు తెలుస్తోంది. శివసేన రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే వద్ద ఉన్న పట్టణాభివృద్ధి శాఖను కూడా సీఎం ఉద్ధవ్ ఠాక్రే తొలగించారు. మరోవైపు ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలు పెంచారు ఏక్ నాథ్ షిండే. గతంలోని సంఘటనలను తవ్వుకుంటున్నారు. ఉద్ధవ్ ఠాక్రే వర్గం షిండే వర్గాన్ని ద్రోహులు అంటూ విమర్శిస్తుంటే.. బాలా సాహెబ్ ఠాక్రేను అరెస్ట్ చేసిన వారితో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని.. దావూద్ ఇబ్రహీంతో సంబంధం ఉన్న వ్యక్తులను ఉద్ధవ్ ఠాక్రే ప్రోత్సహిస్తున్నారని..వారికి మద్దతు ఇవ్వడం అంటే బాల్ ఠాక్రేను అవమానించడమే అంటూ షిండే విమర్శలు చేశారు. ఇటు శివసేన బీజేపీ పార్టీని టార్గెట్ చేసింది. ఒక్కో ఎమ్మెల్యేను రూ. 50 కోట్లకు కొంటున్నారని ఆరోపణలు చేసింది. మహారాష్ట్రలో బీజేపీదే అధికారం అని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.

  Trending Stories

  Related Stories