మళ్లీ వినిపిస్తున్న దావూద్ పేరు.. పలువురు రాజకీయ నాయకులకూ సంబంధాలు

0
836

దావూద్ ఇబ్రహీంపై మనీలాండరింగ్ కేసులో ముంబైలో ఈడీ అధికారులు మంగళవారం నాడు పలు ప్రాంతాల్లో దాడులు చేశారు. పరారీలో ఉన్న దావూద్ ఇబ్రహీంపై మనీలాండరింగ్ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారిస్తోంది. దావూద్ ఇబ్రహీం విదేశాల్లో ఉన్నా కూడా ఇక్కడ ఉన్న తన లింక్స్ తో అండర్ వరల్డ్ ను శాసిస్తూ వస్తున్నాడు.

ఇటీవల నమోదైన కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముంబై సమీప ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్, సోదరుడు ఇక్బాల్ కస్కర్, గ్యాంగ్‌స్టర్ చోటా షకీల్ బావమరిది ఇళ్లపై ఈడీ అధికారులు దాడులు చేశారు. మనీ లాండరింగ్, హవాలా, అక్రమ ఆస్తి లావాదేవీల వ్యవహారంలో భాగంగా ముంబైలోని పలు చోట్ల ఈ సోదాలు నిర్వహించారు. ఈడీ దాడుల్లో మహారాష్ట్రకు చెందిన ఓ రాజకీయ నాయకుడు కూడా ఉన్నారు. అండర్ వరల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణకు సంబంధించి ఈడీ ముంబైలో ఒకరిని అదుపులోకి తీసుకుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) సెక్షన్ల కింద ఈ సోదాలు నిర్వహించారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ఇటీవల దాఖలు చేసిన FIR ఆధారంగా ED ఈ చర్యలు చేపట్టింది. ఈ కేసులో భాగంగానే ఈడీ తాజాగా ఈ దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా ముంబై, దుబాయ్‌లలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కొందరు వ్యాపారుల అక్రమ ఆస్తి లావాదేవీలు, దౌర్జన్యంగా డబ్బు వసూలు చేసిన వ్యవహారాలకు సంబంధించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ముంబై పేలుళ్ల సూత్రధారి, పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించి కొన్ని నిఘా సంస్థలకు ఇన్‌పుట్‌లు అందాయని తెలుస్తోంది. ముంబయి అండర్‌వరల్డ్‌తో ముడిపడి ఉన్న హవాలా, దోపిడీ, అక్రమ ఆస్తుల లావాదేవీలకు సంబంధించిన ఆధారాల కోసం మనీలాండరింగ్ నిరోధక సంస్థ వెతుకుతోంది.