ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సమీర్ మహేంద్రు అరెస్ట్

0
848

ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుల్లో ఒకరైన మద్యం వ్యాపారి సమీర్ మహేంద్రుని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం అరెస్టు చేసింది. ఈ కేసులో నిందితుడైన మరో మద్యం వ్యాపారి విజయ్ నాయర్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అరెస్టు చేసిన ఒక రోజు తర్వాత సమీర్ మహేంద్రుని అరెస్టు చేసింది. ఈ కుంభకోణంలో ఐదో నిందితుడిగా ఉన్న ఓన్లీ మచ్ లౌడర్ మాజీ సీఈఓ విజయ్ నాయర్‌ను మంగళవారం రాత్రి అరెస్టు చేసిన గంటల వ్యవధిలోనే సమీర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ స్కామ్‌లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా మొత్తం 15 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఢిల్లీలోని జోర్‌బాగ్‌లో నివాసం ఉంటున్న సమీర్ మహేంద్రును సీబీఐ గత నెల 22న విచారించింది. ఈ స్కామ్‌లో నిందితుడిగా ఉన్న దినేష్ అరోరాకు చెందిన రాధా ఇండస్ట్రీస్ అనే కంపెనీకి సమీర్ మహేంద్రు కోటి రూపాయలను బ్యాంకు ద్వారా బదిలీ చేసినట్లు సీబీఐ గుర్తించింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు దినేష్ అరోరా అత్యంత సన్నిహితుడని కూడా తెలుస్తోంది. ఓన్లీ మచ్ లౌడర్ కంపెనీ మాజీ సీఈఓ విజయ్ నాయర్ తరఫున సుమారు నాలుగు కోట్ల రూపాయలను అర్జున్ పాండేకు అందజేసిన ఆరోపణలూ ఉన్నాయి.

నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనలకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో మనీష్ సిసోడియాతో సహా మొత్తం 15 మంది పేర్లు ఉన్నాయి. ఎక్సైజ్ పాలసీ 2021-22 అమలులో జరిగిన అవకతవకలపై ఎఫ్‌ఐఆర్ రూపొందించబడింది.