తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి ఈసీ మరోసారి నోటీసులు జారీ చేసింది. రెండు ఈరోజుల వ్యవధిలో దీదీకి అందిన రెండో నోటీసు ఇది. మార్చి 28వ తేదీన, అలాగే ఏప్రిల్ 7న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె చేసిన ప్రసంగాలను ప్రస్తావిస్తూ… వాటిపై ఏప్రిల్ 10వ తేదీన ఉదయం 11 గంటలకల్లా వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం మమతా బెనర్జీని ఆదేశించింది.
అంతకు ముందు కూడా ఓ సభలో మాట్లాడిన మమతా.. ముస్లింలు అందరూ మూకుమ్మడిగా తృణమూల్ కాంగ్రెస్ కు మాత్రమే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్, అబ్బాస్ సిద్ధిఖీ లు ముస్లింల ఓట్లు చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. దీంతో దీదీ… మతపరంగా ఓ వర్గం పోలరైజ్ అయ్యి గంపగుత్తగా తమ పార్టీకే ఓటు వేయాలంటూ ఓ వర్గం ఓటర్లను మభ్యపెడుతున్నారని బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది.
ఈ వివాదాస్పద కామెంట్ల కలకలం ముగియక ముందే మరోక సభలో మాట్లాడిన దీదీ…ఎన్నికల్లో విధుల్లో ఉన్న కేంద్ర పారా బలగాలపై కూడా ఆరోపణలు గుప్పించారు. మహిళలు ఓటు వేయడకుండా కేంద్ర బలగాలు అడ్డుకుంటున్నాయని, వారికి ఆ అధికారం ఎవరు ఇచ్చారంటూ బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. అలాగే పోలింగ్ కేంద్రల వద్ద అడ్డుపడిన భద్రతా బలగాలను మహిళలందరూ కలిసి ఘోరావ్ చేయాలని పిలుపునిచ్చారు. మమతా చేసిన ఈకామెంట్లను తీవ్రంగా పరిగణించిన ఈసీ ఆమెకు రెండోసారి నోటీసులు జారీ చేసింది. అయితే ఈసీ నోటీసులను మమతా బెనర్జీ లైట్ గా తీసుకున్నారని తెలుస్తోంది. తనకు 10 నోటీసులు పంపినా.. తన వైఖరిలో మార్పు ఉండదని ఆమె వ్యాఖ్యానించారు.
మరోవైపు మమతా ఓటమి భయంతో ఇప్పటి నుంచే సాకులు వెతుకుంటున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం బెంగాల్ లో పర్యటించారు. సీఆర్పీఎఫ్ బలగాలను ఘోరావ్ చేయాలని పిలుపునిచ్చిన నేతను., సీఎం ను తాను ఇప్పటి వరకు చూడలేదని షా అన్నారు. పోలింగ్ రోజున మమతా దీదీ… విధ్వంసం సృష్టించడానికి ప్రజలను ఉసిగోల్పుతున్నారా అంటూ అమిత్ షా ప్రశ్నించారు.
అయితే పోలింగ్ బూత్ ల వద్ద కేంద్ర బలగాలు రక్షణ ఉండటాన్ని తృణమూల్ కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. గతంలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం పెరగడంతోపాటు, పోలింగ్ బూత్ ల ఆక్రమణ వంటి ఘటనలు లేకపోడం.. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు ఉండటంతో ఎన్నికల హింసకాండ తగ్గిందని అంటున్నారు.
ఏప్రిల్ 10వ తేదీ..ఉదయం 11 లోపు తాము పంపిన నోటీసులకు మమతా బెనర్జీ బదులు ఇవ్వాలని ఈసీ ఆదేశించిన నేపథ్యంలో… ఈ నోటీసును కూడా పట్టించుకోకుండా వదిలేస్తారా? లేక వివరణ ఇస్తారా? అన్నది వేచి చూడాలి.