More

  భవానీపూర్ లో గెలిచిన దీదీ.. హింస జరగకుండా చూడాలని కోరిన ఎలక్షన్ కమీషన్

  భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి 58,389 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ లో పరాజయం చవిచూసిన మమతా బెనర్జీ ఎట్టకేలకు గెలిచి సీఎం పదవిని నిలుపుకున్నారు. భవానీపూర్ ఉప ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి, బీజేపీ మహిళా నేత ప్రియాంకా టిబ్రేవాల్ ను దీదీ ఓడించారు. ఇంతకు ముందు భవానీపూర్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీఎంసీకే చెందిన శోభన్ దేబ్ ఛటోపాధ్యాయ్ గెలుపొందారు. కానీ మమతా బెనర్జీ నందిగ్రామ్ లో ఓడిపోయినా సీఎం పీఠం ఎక్కారు. ఆర్నెల్లలోపు ఆమె గెలవకపోతే సీఎంగా తప్పుకోవాల్సి ఉంటుందన్న నేపథ్యంలో, శోభన్ దేబ్ భవానీపూర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి, తన నియోజకవర్గంలో సీఎం మమతా బెనర్జీ పోటీచేసేందుకు ఉంచారు.

  భవానీపూర్ ఉప ఎన్నికలో ఘనవిజయం సాధించిన అనంతరం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ.. నందిగ్రామ్ లో తనపై పన్నిన కుట్రలకు భవానీపూర్ ఓటర్లు దీటైన జవాబిచ్చారని అన్నారు. తనకు ఎంతో విలువైన విజయాన్ని కట్టబెట్టిన భవానీపూర్ ప్రజలకు రుణపడి ఉంటానని వినమ్రంగా తెలిపారు. భవానీపూర్ ప్రజలందరికీ కృతజ్ఞతలు. భారత జాతీయులైన అక్కలు, చెల్లెమ్మలు, తల్లులు, ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. 2016లో నాకు ఇక్కడ కొన్ని వార్డుల్లో చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇక్కడి ఓటర్లలో 46 శాతం బెంగాలేతరులే. ప్రతి ఒక్కరూ నాకు ఓటేశారని భావిస్తున్నానని అన్నారు. తనకు వ్యతిరేకంగా కేంద్రం కుట్రలు పన్నుతూనే ఉందని మమత ఆరోపించారు. తమను అధికారం నుంచి దించడమే కేంద్రం లక్ష్యమని తెలిపారు. ఈ పరిణామాల్లో తన కాళ్లకు కూడా గాయాలయ్యాయని ఆమె వివరించారు. ఈ క్రమంలో తాను మళ్లీ సీఎంగా కొనసాగేందుకు సహకరించిన ప్రజానీకం పట్ల సర్వదా విధేయురాలినై ఉంటానని అన్నారు. ఆర్నెల్ల లోపు ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించిన భారత ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని మమత అన్నారు.

  తన ఓటమిపై ప్రియాంకా టిబ్రేవాల్ స్పందించారు. ఈ ఉప ఎన్నికలో ఓడినప్పటికీ తానే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని ప్రకటించుకున్నారు. మమతా బెనర్జీకి కంచుకోట లాంటి నియోజకవర్గంలో తాను పోటీ చేశానని, పైగా 25 వేలకు పైగా ఓట్లను పొందానని ప్రియాంక గర్వంగా చెప్పారు. ఇకపైనా తాను కష్టించి పనిచేస్తానని తెలిపారు. తన ఓటమిని హుందాగా అంగీకరిస్తున్నానని, దీనిపై తాను కోర్టుకు వెళ్లబోనని స్పష్టం చేశారు. కానీ టీఎంసీ నేతలు మమత లక్ష మెజారిటీతో గెలుస్తుందని చెప్పారని, కానీ ఆమెకు లభించిన ఆధిక్యం 58 వేలు మాత్రమేనని ప్రియాంక అన్నారు. విజయం సాధించిన మమతా బెనర్జీకి అభినందనలు తెలియజేస్తున్నానని, కానీ ఆమె ఎలా గెలిచిందో అందరూ చూశారని వ్యాఖ్యలు చేశారు ప్రియాంక.

  ఇక పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం కీలక సూచన చేసింది. భవానీపూర్‌ ఉప ఎన్నిక ఎన్నిక తర్వాత రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఎలక్షన్ కమిషన్ కోరింది. గత ఎన్నికల్లో టీఎంసీ (తృణమూల్ కాంగ్రెస్) భారీ విజయం తర్వాత పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఎంతో మంది తృణమూల్ నేతలు హింసించారు. తమ పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేస్తారా అని ఎంతో మందిపై దాడులు చేశారు. చాలా మంది పశ్చిమ బెంగాల్ ను వదిలిపెట్టి వెళ్లిపోయారు కూడానూ..! దేశం మొత్తం పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల తర్వాత జరిగిన హింసకు షాకైంది. ఇప్పుడు కూడా అలాంటి ఘటనలే చోటు చేసుకుంటాయేమోనని ప్రజలు భయపడుతూ ఉన్నారు.

  Trending Stories

  Related Stories