More

    ప్రమాణ స్వీకారం చేసిన ఈటల రాజేందర్

    హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థిపై విజయం అందుకున్న బీజేపీ అభ్య‌ర్థి ఈటల రాజేందర్ ఈ రోజు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు ఉదయం అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్‌లో ఈ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈట‌ల రాజేందర్‌తో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ నేత‌లు జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈటల రాజేంద‌ర్ ప్ర‌మాణ స్వీకారం చేయ‌డంతో తెలంగాణ అసెంబ్లీలో రాజా సింగ్, ర‌ఘునంద‌న్ రావు, ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీ తరపున ఉండనున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య మరింత పెరుగుతుందని.. అధికారం లోకి వస్తామని బీజేపీ నాయకులు చెబుతున్నారు.

    టీఆర్ఎస్ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్… ఏడోసారి బీజేపీ అభ్యర్థిగా గెలుపొందారు. భూకబ్జా ఆరోపణలతో మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ అయిన ఈటల రాజేందర్‌ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. దీంతో హుజురాబాద్‌ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిపై ఈటల రాజేందర్‌ గెలుపొందారు. 24వేలపైగా ఓట్ల ఆధిక్యంతో హుజురాబాద్‌లో విజయం సాధించి ఏడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పటిదాకా తెలంగాణ అసెంబ్లీలో బీజేపీకి రాజాసింగ్, రఘునందన్ రావు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండగా, ఇప్పుడు రాజేందర్ తోడు కావడంతో RRR కాంబినేషన్ ఏర్పడిందంటున్నారు బీజేపీ నేతలు. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారానికి ముందు గన్‌పార్క్‌లో అమరవీరులకు నివాళులర్పించారు ఈటల.

    Trending Stories

    Related Stories