More

    రాజస్థాన్‌లో భూకంపం.. లఢక్, మేఘాలయాలో కూడా..!

    రాజస్థాన్ రాష్ట్రంలో పలు చోట్ల భారీ భూకంపం సంభవించింది. ఇవాళ తెల్లవారుజామున 5.24 గంటలకు రాజస్థాన్‌లోని బికనీర్‌తో పాటు.. ఇతర ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.3గా నమోదు అయినట్లు భూకంప అధ్యయన కేంద్రం ప్రకటించింది. అప్పుడప్పుడే తెల్లవారుతున్న సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యాయి.సెకన్ల వ్యవధిపాటు భూమి కంపించింది. భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. ప్రస్తుతం నమోదైన భూకంప తీవ్రతకు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని భూకంప అధ్యయన కేంద్రం అధికారులు తెలిపారు. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం రాజస్థాన్ లోని బికనీర్ భూకంపానికి కేంద్రంగా ఉంది. ఉపరితలం నుంచి 110 కిలోమీటర్ల లోతున ఫలకాల్లో చోటు చేసుకున్న భారీ కదలికల వల్ల భూమి కంపించినట్లు వివరించింది. పాకిస్తాన్ సరిహద్దులకు ఆనుకుని ఉంటుంది బికనీర్.

    ఉదయం 5 గంటల 24 నిమిషాల సమయంలో బికనీర్‌కు పశ్చిమ వాయువ్య దిశగా 343 కిలోమీటర్ల దూరంలో 110 కిలోమీటర్ల లోతులో 29.19 -అక్షాంశం 70.05- రేఖాంశల నడుమ ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ట్విట్టర్‌లో వెల్లడించింది. మేఘాలయలోని వెస్టు ఘరోహిల్స్‌ ప్రాంతంలోనూ ఈ ఉదయం 4.1 తీవ్రతతో భూకంపనలు సంభవించినట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం పేర్కొంది. అర్ధరాత్రి దాటిన తరువాత 2:10 నిమిషాలకు భూమి ప్రకంపించినట్లు నేషనల్ సిస్మాలజీ సెంటర్ తెలిపింది. మేఘాలయా పశ్చిమ ప్రాంతంలోని ఈ ప్రకంపనలు నమోదయ్యాయి. రెండున్నర గంటల తరువాత లఢక్‌లో కూడా భూకంపం నమోదైంది. తెల్లవారు జామున 4:57 నిమిషాల సమయంలో లఢక్ రాజధాని లేహ్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదైంది.

    కొద్దిరోజుల కిందట గుజరాత్ లో కూడా భూకంపం సంభవించింది. గుజరాత్‌లోని కచ్‌ జిల్లాలో ఆదివారం భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 12.43 గంటలకు రిక్టర్‌ స్కేల్‌పై 3.9 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. కచ్‌ జిల్లాకు 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈశాన్య భచావులో భూమికి 14.2 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు నేషనల్‌ సిస్మోలజీ అధికారులు తెలిపారు. ప్రకంపనలతో నష్టం జరిగినట్లు ఎలాంటి నివేదిక అందలేదు.

    Trending Stories

    Related Stories