అమెరికాలోని అలస్కా ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 8.2 తీవ్రతతో ప్రకంపనలు రావడంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10.15 గంటల సమయంలో పెర్రివిల్లెకు తూర్పు-ఆగ్నేయంలో 57 మైళ్ల దూరంలో, భూమికి 29 మైళ్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. ఆ తర్వాత అదే ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 6.5.. 5.6 తీవ్రతతో మరో రెండుస్లారు భూమి కంపించడంతో జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం దక్షిణ ప్రాంతంతో పాటు, ఫసిఫిక్ తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. యూఎస్ హవాయి, ఇతర అమెరికా, కెనడియన్ ఫసిఫిక్ తీర ప్రాంతాలకూ సునామీ ముప్పు ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. అయితే, భూ ప్రకంపనలతో ప్రాణ, ఆస్తినష్టానికి సంబంధించి ఎలాంటి నివేదికలు అందలేదని అధికారులు తెలిపారు.అలస్కాతోపాటు హువాయి దీవుల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సునామీ హెచ్చరికలతో జపాన్ దేశం కూడా అప్రమత్తమైంది.
పెర్రివిల్లె పట్టణానికి ఆగ్నేయంగా 56 మైళ్ళు (91 కిలోమీటర్లు) దూరంలో భూకంపం సంభవించిందని, దక్షిణ అలస్కా మరియు అలస్కాన్ ద్వీపకల్పంలో సునామీ హెచ్చరికలు జారీ చేశామని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
“ఈ భూకంపానికి ప్రమాదకరమైన సునామీ అలలు కొన్ని తీరాలలో రాబోయే మూడు గంటల్లోనే వచ్చేందుకు అవకాశం ఉంటుంది” అని యుఎస్ సునామి హెచ్చరిక వ్యవస్థ ఒక ప్రకటనలో తెలిపింది. పెర్రివిల్లె అలస్కాలోని అతిపెద్ద నగరమైన ఎంకరేజ్ నుండి 500 మైళ్ళ దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం. అలస్కాలో భూకంపాలు సర్వ సాధారణమైన అంశం అని నిపుణులు తెలిపారు.