International

పాకిస్తాన్ లో భారీ భూకంపం..!

పాకిస్తాన్ ను భారీ భూకంపం వణికించింది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం 20 మంది మరణించగా.. వందల్లో గాయపడ్డారు. దక్షిణ పాకిస్తాన్ లో ఉదయం భూమి ఒక్కసారిగా కంపించింది. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో భూకంపం సంభవించిందని, రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.7గా నమోదైందని అధికారులు తెలిపారు. భూ ప్రకంపన కారణంగా పర్వత నగరం హర్నాయిలో తీవ్ర నష్టం చోటు చేసుకుంది. ఇక్కడ రోడ్డు, విద్యుత్, మొబైల్ సౌకర్యం అంతగా లేకపోవడంతో బాధితులను రక్షించడం రెస్క్యూ సిబ్బందికి ఇబ్బందిగా మారింది. భూకంపం కారణంగా 20 మంది వరకు చనిపోయినట్టు తమకు సమాచారం అందిందని బలూచిస్థాన్ హోమంత్రి మిర్ జియా ఉల్లా లాంగౌ తెలిపారు. మృతుల్లో మహిళ సహా ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ల కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్లను పంపిస్తున్నట్టు ప్రావిన్షియల్ సీనియర్ అధికారి సుహైల్ అన్వర్ హష్మి తెలిపారు.

‘భూకంపం కారణంగా 20 మంది మరణించినట్లు మాకు సమాచారం అందుతోంది. రెస్క్యూ ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని ప్రావిన్షియల్ అంతర్గత మంత్రి మీర్ జియా ఉల్లా లాంగా చెప్పారు. బలూచిస్తాన్ ప్రావిన్షియల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ హెడ్ నసీర్ నాసర్మాట్లాడుతూ 15 మంది నుండి 20 మంది దాకా మరణించారని.. అయితే మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఆ ప్రాంతంలో కరెంట్ పోవడంతో వైద్య సిబ్బందికి కూడా చికిత్స చేయడం చాలా ఇబ్బందిగా మారింది. ఇక ఆ ప్రాంతాలకు పాకిస్తాన్ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలలో కనీసం సరైన రోడ్డు సదుపాయం కూడా వేయలేదు.. దీంతో రెస్క్యూ సిబ్బంది వెళ్లడం.. వేరే నగరాలకు బాధితులను తరలించడం కూడా కష్టంగా మారింది.

“విద్యుత్ లేకపోవడంతో టార్చి లైట్లు మరియు మొబైల్ ఫ్లాష్‌లైట్ల సహాయంతో పనిచేస్తున్నాము “అని జహూర్ తారిన్, ప్రభుత్వ హర్నాయ ఆసుపత్రి సీనియర్ అధికారి మీడియాకి చెప్పారు. “గాయపడిన వారిలో చాలా మంది ఎముకలు విరిగిపోయాయి. ప్రథమ చికిత్స తర్వాత డజన్ల కొద్దీ మందిని వెనక్కి పంపాము.. అయితే తీవ్రంగా గాయపడిన దాదాపు 40 మందిని అంబులెన్స్‌లో క్వెట్టాకు పంపారు.” అని తెలిపారు. బలూచిస్తాన్ ప్రావిన్షియల్ రాజధాని క్వెట్టాలో కూడా భూకంపం సంభవించింది. అక్టోబర్ 2015 లో పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్‌లో 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపంలో దాదాపు 400 మంది మరణించారు. అక్టోబర్ 8, 2005 న పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ సమయంలో 73,000 మందికి పైగా మరణించారు. 3.5 మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు.

Related Articles

Back to top button