ద్వారకా శ్రీకృష్ణుడి ఆలయంపై పిడుగు..!

ఉత్తర భారతదేశంలో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలతో పాటూ పిడుగులు కూడా పడుతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పిడుగుపాటుకు ఎంతో మంది మరణించారు. గుజరాత్ దేవ్‌భూమి ద్వారకాలోని ప్రఖ్యాత శ్రీకృష్ణుని ద్వారకాధిష్ ఆలయంపై పిడుగులు పడ్డ వీడియో వైరల్ అవుతోంది. ఈ ఉరుములు, పిడుగుల కారణంగా ఆలయ నిర్మాణానికి ఎటువంటి నష్టం జరగలేదు. అంతేకాకుండా ప్రాణనష్టం జరగలేదని ఆలయ అధికారులు వెల్లడించారు. సంఘటన జరిగిన సమయంలో ఆలయ ప్రాంగణం లోపల, చుట్టుపక్కల ప్రజలు ఉన్నారు. భారీ వర్షపాతం మధ్య పిడుగులు పడ్డాయి. పరిస్థితిని సమీక్షించాలని దేవ్‌భూమి-ద్వారకా జిల్లా పరిపాలన విభాగాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాయత్తం చేశారు. ఆయన లోక్‌సభ నియోజకవర్గమైన గాంధీనగర్ పై కేంద్ర హోంమంత్రి కార్యాలయం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆలయానికి ఎటువంటి నష్టం జరగలేదని.. ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. ఆలయ నిర్వహణతో పాటు జిల్లా కలెక్టర్‌తో షా చర్చలు జరిపారు. సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయిన ఫుటేజీలో వర్షం మేఘాల నుండి ఆలయ నిర్మాణంపైకి ప్రవేశించిన కాంతిని చూడవచ్చు. తుఫాను మధ్యలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నైరుతి రుతుపవనాల పురోగతి కారణంగా గుజరాత్ లో విస్తృతంగా వర్షపాతం నమోదవుతోందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ ఏడాది వర్షాకాలంలో గుజరాత్ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా సౌరాష్ట్ర-కచ్, డామన్ డియు, దాద్రా మరియు నగర్ హవేలి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) అహ్మదాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర, దక్షిణ గుజరాత్‌లలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆనంద్ జిల్లాలోని గుజరాత్ ఆనంద్ తహసీల్‌లో అత్యధికంగా 183 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సబర్కాంత జిల్లాలో వడాలి జూన్ నుండి 150 మిల్లీమీటర్ల వర్షపాతం, దేవ్‌భూమి ద్వారకాలో 128 ఎంఎం, సూరత్‌లోని చోరియాసి 124 మిమీ వర్షపాతం నమోదైంది.