శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ టీడీపీ నేత అచ్చెన్నాయుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ గురించి మాట్లాడితే టెక్కలి రోడ్లపై అచ్చెన్నాయుడిని గుడ్డలు ఊడదీసి కొడతా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అచ్చెన్నాయుడిని నేను అలా కొట్టకపోతే.. తాను దువ్వాడ శ్రీనివాసే కాదంటూ సవాల్ చేశారు. అచ్చెన్నాయుడిని కొట్టడానికి తనకు ఒక్క నిమిషం సమయం సరిపోతుందన్నారు దువ్వాడ శ్రీనివాస్. తెలుగుదేశం పార్టీకి మరొకరు దిక్కులేకే అంబోతులా ఉన్న అచ్చెన్నాయుడిని ఏపీ అధ్యక్షుడిగా కొనసాగిస్తున్నారని.. మహానాడు వేదికపై జగన్ ను ఉద్దేశిస్తూ అచ్చెన్నాయుడు మాట్లాడిన ప్రతి మాటకు బదులిస్తానని దువ్వాడ చెప్పుకొచ్చారు. అచ్చెన్నాయుడు ఇప్పటికైనా పిచ్చిపిచ్చిగా మాట్లాడటం ఆపాలని, నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. లేదంటే ఆహుతి సినిమాలో విలన్ ను హీరో రోడ్డుపై కొట్టినట్లు తాను అచ్చెన్నాయుడిని గుడ్డలూడదీసి కొడతానని దువ్వాడ శ్రీనివాస్ హెచ్చరించారు. పేదల సంక్షేమం కోసం పని చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం తాను ఆత్మహుతి దళం సభ్యుడిగా మారడానికి సిద్ధంగా ఉన్నానని దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.