దుర్గాపూజకు యునెస్కో గుర్తింపు..!

0
884

ముగురుమ్మల మూలపుటమ్మ.. అమ్మలగన్నయమ్మ.. మన దుర్గమ్మ పూజకు ప్రపంచస్థాయి గుర్తింపు లభించింది. దసరా ఉత్సవాలకు పెట్టింది పేరైన పశ్చిమ బెంగాల్‎లో జరిగే.. దుర్గా పూజకు యునెస్కో గుర్తింపు ఇచ్చింది. దుర్గామాత పూజను మానవాళి సాంస్కృతిక వారసత్వ నైరూప చిహ్నాల జాబితాలో చేర్చింది. గత సెప్టెంబరులో, పశ్చిమ బెంగాల్ పర్యాటక శాఖ, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ.. దుర్గ పూజ గురించి యునెస్కోకు ప్రతిపాదనను పంపింది. డిసెంబర్ 13 నుండి 18 వరకు పారిస్‌లో జరిగిన యునెస్కో కమిటీ 16వ సమావేశంలో ‘కోల్‌కతాలో దుర్గా పూజ’కు గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించారు.

పశ్చిమ బెంగాల్‎లో దసరా న‌వరాత్రుల్లో జ‌రిగే దుర్గా పూజ‌లకు దేశవ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా విశేషమైన గుర్తింపు ఉంది. ఉత్సవాల సందర్భంలో విదేశాల నుంచి కూడా పర్యటాకులు వస్తుంటారు. నిజానికి, దుర్గాపూజకు యునెస్కో గుర్తింపు ఎప్పుడో రావాల్సింది. ఆలస్యంగానైనా బెంగాల్ దుర్గాపూజకు అరుదైన గుర్తింపు దక్కింది. దుర్గాపూజకు యునెస్కో గుర్తింపు లభించడం పట్ల కేంద్ర సాంస్కృతిక శాఖ హర్షం వ్యక్తం చేసింది. ఈ పండుగను లింగభేదం, ఆర్థిక అసమానతలు లేని పండుగ అని కొనియాడింది.

యునెస్కో గుర్తింపు లభించిన వెంటనే దుర్గాపూజ గురించిన యునెస్కో వెబ్‌సైట్‌లో పండుగ గురించిన వివరాలను పోస్ట్ చేశారు. మతాలకతీతంగా సమాజంలోని అన్ని వర్గాల వారిని, లింగభేదం లేకుండా, పేద, ధనిక అనే తేడా పాటించకుండా అందర్నీ కలుపుకుంటూ జరుపుకునే పండుగ ఇదంటూ యునెస్కో కీర్తించింది. ఈ పండుగ సందర్భంగా పట్టణ ప్రాంతాలలో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తారు. మంటపాలు, సాంప్రదాయ బెంగాలీ తబలా వాయిద్యాలతో మారుమోగుతాయి. దుర్గాపూజకు అరుదైన గౌరవం ద‌క్క‌డంపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విష‌యం ప్ర‌తి భారతీయుడికీ ఎంతో గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని, యునెస్కో జాబితాలో చోటు ద‌క్క‌డం ఎంతో సంతోష‌క‌ర‌మైన విష‌యం అని ట్వీట్ చేశారు. ఇక బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఈ విష‌యం బెంగాలీల‌కు ఎంతో గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని తెలిపారు. తాము దుర్గా పూజ‌ను కేవ‌లం పూజ‌గా మాత్ర‌మే నిర్వ‌హించ‌మ‌ని, అది ఓ భావ‌న‌లాగా నిర్వ‌హించుకుంటామ‌ని మ‌మ‌త చెప్పారు.

ఇంతకు ముందు, 2017లో కుంభమేళా, 2016లో యోగాతో భారతీయ పండుగలకు ఇటువంటి గుర్తింపు లభించింది. పంజాబ్‌లోని సాంప్రదాయ ఇత్తడి, రాగి హస్త కళలకు 2014లో గుర్తింపు లభించగా, మణిపూర్ సంకీర్తన ఆచార గానం 2013లో గుర్తింపు పొందింది. పశ్చిమ బెంగాల్‌లోని పురూలియా జిల్లాకు చెందిన చౌ జానపద నృత్యానికి 2010లో ఇటువంటి గుర్తింపు లభించింది, ముడియెట్టు, ఆచార థియేటర్, కేరళ నృత్య నాటకం, రాజస్థాన్‌లోని కల్బెలియా జానపద పాటలు, నృత్యాలతో పాటు, కుటియాట్టం సంస్కృత థియేటర్, రాంలీలా, వేద మంత్రాల సంప్రదాయం, లడఖ్ బౌద్ధ శ్లోకాలు గతంలో ఈ విధమైన గుర్తింపును పొందాయి.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

eight + 16 =