చైనా పైత్యం నానాటికీ పెరిగిపోతోంది. ప్రత్యక్ష యుద్ధం చేయలేక.. నక్కజిత్తులు ప్రదర్శిస్తోంది. చుట్టూ ఉన్న దేశాల్ని భయపెట్టి లబ్దిపొందాలని చూస్తోంది. సరిహద్దు దేశాలను ఆర్థికంగా, సామాజికంగా దెబ్బతీసి పబ్బం గడుపుకోవాలని చూస్తోంది. దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం కోసం.. ఇప్పటికే జపాన్, మలేషియా, ఆస్ట్రేలియా దేశాలతోనూ వైరం పెంచుకుంది. వన్ చైనా పాలసీలో భాగంగా తైవాన్ ను మింగేయాలని చూస్తోంది. హాంకాంగ్, టిబెట్‌లను ప్రత్యక్షంగా ఆక్రమించుకుంది. పరోక్షంగా నేపాల్, మయన్మార్‌లపై పట్టు బిగించింది. అటు, వన్ చైనా పాలసీలో భాగంగా భారత్‌లోని సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లపై కన్నేసింది. ఇందుకోసం భారత సైన్యంతో ఘర్షణలకు దిగుతోంది. ఇప్పటికే 67 వేల కిలోమీటర్ల భారత భూభాగాన్ని మింగేసిన చైనా.. ఇప్పుడు కూడా మళ్ళీ అదే తరహాలో ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేసింది. కానీ, ఈసారి భారత సైన్యం ముందు చైనా ఆటలు సాగడం లేదు. బోర్డర్ దాటాలన్న డ్రాగన్ ప్రయత్నాలకు భారత్ ఎక్కిడికక్కడ చెక్ పెడుతోంది.
ఎదుటివారిని తక్కువగా అంచనా వేస్తే ఎంత ప్రమాదమో చైనాకు ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది. గల్వాన్ లోయలో భారత సైన్యాన్ని చిత్తుచేద్దామనుకు బోర్డర్ దాటిన డ్రాగన్ సైన్యం బొక్కాపోర్లా పడింది. భారత్ ఘాతుక్ టీమ్ దెబ్బకు కుంగ్ ఫూలు, కరాటేలు ఎందుకూ కొరగాకుండా పోయాయి. భారత సైన్యంతో పోరాడలేక 43 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. నిజానికి, చనిపోయిన సైనికుల సంఖ్య 100 పైగానే వుంటుందని భారత వర్గాలు చెబుతుండగా.. అదేం లేదని, నలుగురే చనిపోయారని అబద్దాలు చెప్పుకుంది.
ఇక గల్వాన్ దెబ్బతో కుయ్యోమొర్రో అన్న డ్రాగన్ సైన్యం.. అప్పటి నుంచి భారత్ తో తలపడాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మధ్య మధ్యలో సైన్యాన్ని కవాతులు చేయిస్తూ తాటాకు చప్పుళ్లు చేస్తున్నా.. చైనా సైన్యం సత్తా ఏంటో గల్వాన్ తోనే తేలిపోయింది. మధ్యలో ఓసారి కాల్పులకు దిగినా.. భారత్ సైన్యం ఎదురుదాడికి తట్టుకోలేక పరుగులు పెట్టారు. ఆ తర్వాత రష్యా మధ్యవర్తిత్వంతో కాలయాపన చేసింది. అలా చేస్తే భారత సైన్యం మంచులో ఎక్కువ రోజులు ఉండలేరని.. అప్పుడు ఎటాక్ చేసి దెబ్బకొట్టచ్చని నక్కజిత్తుల చైనా లెక్కలేసుకుంది. కానీ, మంచులో పోరాటం మనవాళ్లకు వెన్నతో పెట్టిన విద్య అని తెలియని చైనా.. బిక్కమొహమేసింది.
ఏతా వాతా తేలిందేమిటంటే.. మంచు పర్వతాల్లో యుద్ధం చేయడం డ్రాగన్ లిల్లీపుట్ సైన్యానికి అస్సలు చేతగాదని. భారత్ సైన్యానికి ఎదురునిలవడం కాదు గదా.. కనీసం కాపలా కాయడం కూడా వారి వళ్ల కాదని తేలిపోయింది. మనవాళ్లేమో మంచుకు అలవాటైపోతే.. వాళ్లు హాట్ టెంట్లలో రెస్ట్ తీసుకున్నారు. దీంతో మంచు తీవ్రతకు ఇంకా తట్టుకోలేని స్థితికి చేరారు. మావళ్ల కావడం లేదు బోర్డర్ నుంచి వెనక్కి పిలిపించడంటూ హెడ్ క్వార్టర్స్ కు మొరపెట్టుకున్నారు. దీంతో 50 వేల మందిలో 40 వేల మంది సైన్యాన్ని చైనా వెనక్కి పిలిచి.. మళ్లీ కొత్తవాళ్లతో భర్తీ చేశారు. కానీ, భారత సైన్యం మాత్రం మంచును లెక్క చేయకుండా సరిహద్దుల్ని కాపలాకాస్తుడటం చైనాకు మింగుడు పడటం లేదు.
మొత్తానికి గల్వాన్ షాక్ తో ప్రత్యక్ష యుద్ధానికి దిగాలన్న ఆలోచనే డ్రాగన్ కంట్రీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. నిజానికి, మంచు కొండల్లోనే కాదు.. అసలు పీఎల్ఏ సైన్యం ప్రత్యక్ష యుద్ధానికి పనికిరాదన్నది రక్షణ రంగ నిపుణులు చెబుతున్నమాట. అసలు చైనాకు ఇప్పుడు నైపుణ్యం కలిగిన సైన్యం లేకపోవడమే కారణం అని తెలుస్తోంది. చైనా జనాభా నియంత్రణలో భాగంగా తీసుకున్న ఇంటికి ఒక బిడ్డ నిబంధన కారణంగా చైనాలో యువత తగ్గిపోయింది. అంతేకాకుండా ఉన్న ఒక్క బిడ్డను యుద్దానికి పంపేందుకు అక్కడి తల్లిదండ్రులు సిద్దంగా లేరు. దాంతో ప్రతి ఒక్కరూ పెద్దయిన తరువాత రెండేళ్ల పాటు సైన్యంలో తప్పనిసరిగా పనిచేయాలని నిబంధన తీసుకువచ్చింది. ప్రస్తుతం చైనాకి ఉన్న అత్యధిక సైన్యం వీరే. సరైన శిక్షణ లేని వీరితో యుద్దం మొదలు పెడితే చైనాకు పరాజయం తప్పదు. అందుకనే చైనా ప్రత్యక్ష యుద్దానికి తెగించడం లేదని నిపుణులు అంటున్నారు.
అందుకే చైనా ఆటో ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఆర్మీని తయారు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, చైనా దగ్గర సాంకేతిక ఆయుధ సంపత్తి బాగానేవున్నా.. వాటిని ఉపయోగించే సామర్థ్యం సైన్యానికి ఉండాలి కదా..! అలాంటి నిపుణుత కలిగిన సైన్యం లేకపోవడంతో.. ప్రత్యక్ష యుద్ధానికి చైనా వణికిపోతోంది. అందుకే, బోర్డర్ లో అప్పుడప్పుడూ సైన్యాన్ని మోహరిస్తూ తాటాకు చప్పుళ్లు చేస్తోంది. కానీ, భారత్ ఈ తాటాకు చప్పుళ్లకు భయపడటం లేదు. ఇప్పుడున్నది 1965 భారత్ కాదు.. అత్యాధునిక ఆయుధ శక్తి.. అంతకుమించి గుండెనిబ్బరం కలిగిన ఆత్మనిర్బర భారత్. మోదీ పాలనలో రూల్స్ మారాయి. రూపురేఖలూ మారాయి. ఇప్పుడు భారత్ తో పెట్టుకోవాలంటే చైనా అయినా, దాని జేజమ్మ అయినా ఒక్కటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిందే.