More

    డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో వాహనాలు సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు

    డ్రంకెన్ డ్రైవ్ కేసులు.. మద్యం తాగి వాహనాలు నడిపి.. ఎంతో మంది ప్రాణాలు పోడానికి కారణమవుతూ ఉన్నారు. తాగి కార్లను డ్రైవ్ చేసే వాహనాలను పోలీసులు సీజ్ చేస్తూ ఉంటారు. తాగి నడిపిన వ్యక్తులకు కౌన్సిలింగ్ ఇవ్వడమే కాకుండా.. జైలు శిక్షలు కూడా విధిస్తూ ఉంటారు. అయితే డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో వాహనాలు సీజ్ చేసే అంశంపై తెలంగాణ హైకోర్టు పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

    వాహనదారుడు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో మద్యం తాగినట్టు తేలితే, ఎట్టిపరిస్థితుల్లోనూ అతడిని వాహనం నడిపేందుకు అనుమతించరాదని తెలంగాణ హై కోర్టు స్పష్టం చేసింది. అతడి వెంట ఎవరూ లేని పరిస్థితుల్లో సన్నిహితులను పిలిపించి వాహనం అప్పగించాలని ఆదేశించింది. ఒకవేళ మద్యం తాగిన వ్యక్తి తరఫున ఎవరూ రాకపోతే ఆ వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించాలని, తర్వాత వాహనాన్ని అప్పగించాలని తెలిపింది. అతడి వెంట మద్యం తాగని వ్యక్తి ఉంటే అతడికి వాహనం ఇవ్వొచ్చని వెల్లడించింది. మద్యం మత్తులో డ్రైవ్ చేసే వారి వాహనాలను సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని తెలిపింది.

    ఎవ‌రూ రాక‌పోతే వాహ‌నాన్ని పోలీసు స్టేషన్ కు త‌ర‌లించి, త‌ర్వాత ఇవ్వాల‌ని ఆదేశించింది. ప్రాసిక్యూషన్‌ అవసరమైన కేసుల్లో 3 రోజుల్లో ఛార్జిషీట్‌ వేయాలని కోర్టు సూచించింది. ప్రాసిక్యూషన్‌ పూర్తయ్యాక వాహనం అప్పగించాలని తెలిపింది. వాహనం కోసం ఎవరూ రాకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని.. ఆదేశాలు అమలు చేయని పోలీసులపై కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని తెలంగాణ హైకోర్టు తన ఆదేశాల్లో తెలిపింది. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల సందర్భంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ దాఖలైన ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర హై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

    Trending Stories

    Related Stories