అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో డొనాల్డ్ ట్రంప్ కు కరోనా సోకిన సంగతి తెలిసిందే..! అది కూడా ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలో ట్రంప్ కరోనా బారిన పడ్డాడు. అయితే ఎవరూ ఊహించని విధంగా ట్రంప్ అతి తక్కువ సమయంలో కోలుకున్నాడు. సాధారణంగా కరోనా బారిన పడిన వారు కోలుకోడానికి రెండు వారాలు సమయం ఉండాలని.. ఆ సమయంలో ఐసోలేషన్ లో ఉండాలని చెబుతూ ఉండేవారు. కానీ ట్రంప్ అతి తక్కువ రోజుల్లో కరోనా నుండి కోలుకున్నారు. అప్పట్లో ట్రంప్ కరోనా నుండి కోలుకోడానికి కారణమైన డ్రగ్ గురించి విపరీతమైన చర్చ జరిగింది. అదే ‘యాంటీబాడీ కాక్ టెయిల్’..! ఇది ఇవ్వగానే డొనాల్డ్ ట్రంప్ కోలుకున్నారంటూ అప్పట్లో ప్రపంచ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఇన్ని రోజులకు ఈ డ్రగ్ భారత్ లోకి రంగప్రవేశం చేసింది.
ప్రముఖ ఫార్మా సంస్థలు సిప్లా-రోచ్ ఇండియా సంయుక్తంగా దీన్ని భారత్ మార్కెట్లో ప్రవేశపెట్టాయి. ఈ కాక్ టెయిల్ ఔషధంలో రెండు మందులు కలిసి ఉంటాయి. ఇమిడివిమాబ్, కాసిరివిమాబ్ ఔషధాల కలయికనే ఈ కాక్ టెయిల్ ఔషధం. భారత మార్కెట్లో 1200 ఎంజీ ఒక డోసు యాంటీబాడీ కాక్ టెయిల్ ను రూ.59,750కి విక్రయించనున్నారు. ఒక్క ప్యాక్ ను ఇద్దరు రోగులకు వినియోగించవచ్చని తయారీదార్లు తెలిపారు. ముఖ్యంగా సాధారణ రిఫ్రిజిరేటర్లలో భద్రపరచవచ్చు. తక్కువ, ఓ మోస్తరు కరోనా లక్షణాలు ఉన్నవారికి దీన్ని అందించవచ్చు. ఇది వాడితే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం చాలా తక్కువ అని రోచ్ ఇండియా, సిప్లా వర్గాలు వెల్లడించాయి. ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు కూడా ఈ యాంటీబాడీ కాక్ టెయిల్ ను వాడొచ్చని తెలిపాయి.
భారత్ లో ఈ యాంటీ బాడీ కాక్-టెయిల్ మందు అత్యవసర వినియోగానికి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనుమతించింది. 1200 ఎంజీల డ్రగ్ లో ఒక్కొక్కటి 600 ఎంజీల కెసిరివిమాబ్, ఇంతే ఎంజీల ఇమ్ డెవి మాబ్ ఉంటాయని రోచె ఇండియా వెల్లడించింది. దీని గరిష్ట ధర లక్షా 19 వేల 500 రూపాయలని వివరించింది. ఒక్కో ప్యాక్ ఇద్దరు కోవిద్ రోగులకు సరిపోతుందని, ఇండియాలో దీని మెదటి బ్యాచ్ ని సిప్లా సంస్థ మార్కెట్ చేస్తుందని వెల్లడించింది. రెండో బ్యాచ్ జూన్ మధ్యకల్లా అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ మెడిసిన్ పేరున్న కార్పొరేట్ ఆసుపత్రులు, కోవిద్ ట్రీట్ మెంట్ సెంటర్లలో లభించనుందని సిప్లా-రోచె ఇండియా సంస్థలు జాయింట్ స్టేట్మెంట్లో తెలిపాయి. ఈ డ్రగ్ కు పలు యూరప్ దేశాలు కూడా ఆమోద ముద్ర వేశాయి. చాలా మంది కరోనా రోగులను కాపాడడానికి ఈ డ్రగ్ ఉపయోగపడిందని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. ఈ డ్రగ్ ను తీసుకునే వారి వయసు 12 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండాలని.. అలాగే 40 కేజీల కంటే ఎక్కువ బరువు ఉండాలని తెలిపారు. అయితే ఈ డ్రగ్ ధర మరీ ఎక్కువగా ఉండడంతో మధ్య తరగతి, పేద ప్రజలు దీని వైపు మొగ్గు చూపకపోవచ్చు.