భారత నూతన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆమెతో ప్రమాణం చేయించారు. ఆమె భారత్ కు ఆమె 15వ రాష్ట్రపతి అయ్యారు. అలాగే ఈ పదవిని చేపట్టిన రెండో మహిళగా ద్రౌపది ముర్ము రికార్డుల్లోకి చేరారు. అత్యున్నత రాజ్యాంగ పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళగా కూడా ఆమె చరిత్ర సృష్టించారు. రాష్ట్రపతి పదవిని అలంకరించిన అతి పిన్న వయసు ఉన్న వ్యక్తి కూడా ఆమెనే..! పార్లమెంటు సెంట్రల్ హాల్లో ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా ద్రౌపది ముర్మును పార్లమెంట్ సెంట్రల్ హాల్లోకి తొడ్కొని వచ్చారు. ఒక ఆదివాసీ మహిళను అయిన నాకు ఇంత గొప్పఅవకాశం కల్పించిన దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తనను దేశ అత్యున్నత పదవికి ఎన్నిక చేసినందుకు ధన్యవాదాలు చెప్పారు. తనపై నమ్మకం పెట్టిన దేశ ప్రజల విశ్వాసం నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానని.. 50 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల వేళ తన రాజకీయ జీవితం మొదలైందని గుర్తుచేసుకున్నారు. 75 ఏళ్ల ఉత్సవాల వేళ భారత రాష్ట్రపతిగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని అన్నారు. దేశంలో మరింత వేగంగా అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉందని.. అందరి సహకారంతో దేశాన్ని ముందుకు తీసుకుని వెళ్లాలని కోరుతున్నట్లు తెలిపారు.