ఎన్డీఏ ప్రతిపాదిత రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. ఎలక్టోరల్ కాలేజీలో మెజార్టీ ఉన్న ఎన్డీఏ తమ అభ్యర్ధి నామినేషన్ నుంచి ఎన్నికల వరకు ఏ రకంగా ముందుకు వెళ్లాలనే అంశంపైన రూట్ మ్యాప్ సిద్దం చేసారు.
ఇప్పటికే ఢిల్లీ చేరిన ముర్ము.. ఉపరాష్ట్రపతి- ప్రధానిని కలిశారు. నామినేషన్ కార్యక్రమానికి రావాల్సిందిగా ఎన్డీఏ పక్షాలతో పాటుగా.. మద్దతు ఇస్తున్న పార్టీల నేతలకు ఆహ్వానాలు పంపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత సీఎంలు హాజరయ్యారు. మొదటగా ప్రధాని ఆమె పేరును ప్రతిపాదిస్తారు. నామినేషన్ పత్రాలను 50 మంది ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ప్రతిపాదించి, మరో 50 మంది బలపరచాల్సి ఉంది. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆమె ఎంపికను సమాజంలోని అన్ని వర్గాలు ప్రశంసిస్తున్నాయని ప్రధాని ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి వైసీపీ అధికారికంగా ఎన్డీఏ అభ్యర్ధికి మద్దతు ప్రకటించింది. తొలుత సీఎం జగన్ నామినేషన్ కార్యక్రమానికి తొలుత హాజరు కావాలని భావించారు. కానీ, చివరి నిమిషంలో ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నారు. వైసీపీ నుంచి పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి.. లోక్ సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి హాజరయ్యారు.
ఇక, జూలై 1వ తేదీ నుంచి ముర్ము ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోరోజు కేటాయించే వీలుంది. కేరళ నుంచి ఎన్డీయే అభ్యర్థి ముర్ముకి ఒక్క ఓటు కూడా పడే అవకాశం లేదు. జమ్మూ-కశ్మీర్ శాసనసభ ఇంకా ఏర్పాటు కాకపోవడంతో ఈసారీ అక్కడి ప్రజాప్రతినిధులు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్ లేనట్లే. తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ తమ అధికార నిర్ణయం ఇంకా ప్రకటించలేదు. నామినేషన్ ప్రక్రియ సమయంలో ఒడిశా ప్రభుత్వం తరఫున ఇద్దరు మంత్రులు ఆమె వెంటే ఉండాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదేశించారు.
త్వరలో రాష్ట్రాల్లో ద్రౌపది పర్యటించనున్నారు. ఆ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, కిషన్‌రెడ్డిలు పర్యవేక్షించనున్నారు. పార్టీలకు అతీతంగా..ప్రతీ రాష్ట్రంలోని ఓటర్లను కలిసేలా ప్రణాళికలు సిద్దం చేసారు. ఏపీలో జూలై 4వ తేదీన ముర్ము పర్యటన ఉంటుందని తెలుస్తోంది. దీంతో..వైసీపీ మరోసారి ఎన్టీఏ అభ్యర్ధికే మద్దతివ్వటం ముందు నుంచి అంచనా వేసిన అంశమే అయినా.. ఇప్పుడు మరోసారి బీజేపీ – వైసీపీ బంధం పైన చర్చ మొదలైంది. టీడీపీ సైతం అధికారికంగా తమ నిర్ణయం వెల్లడించలేదు.