భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్ కలకలం మొదలైంది. గత అర్దరాత్రి ఓ డ్రోన్ కనిపించింది. పంజాబ్ రాష్ట్రంలోని మృత్‌సర్ అజ్నాలా పోలీసుస్టేషన్ పరిధిలోని షాపూర్ సరిహద్దు అవుట్ పోస్టు వద్ద డ్రోన్ కనిపించింది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లోని 73వ బెటాలియన్ జవాన్లు డ్రోన్‌పై కాల్పులు జరిపారు. దీంతో డ్రోన్ పాక్ వైపు తిరిగి వెళ్లింది. పాక్ నుంచి భారత్ వైపు భూభాగంలో ఆయుధాలు, డ్రగ్స్ ను వదిలేందుకు పాకిస్థాన్ డ్రోన్లను అర్దరాత్రి పంపించిందని అధికారులు. గతంలో పలు మార్లు డ్రోన్లు ఇలా రావడం.. వాటిని భారత ఆర్మీ కూల్చేసిన సంగతి తెలిసిందే. అక్టోబరు 19, 20వతేదీ మధ్య రాత్రి అమృత్‌సర్ సెక్టార్‌లోని ఇండో-పాక్ సరిహద్దుల్లోనూ ఇలాంటి డ్రోన్ కనిపించింది. ఆ డ్రోన్ ను బీఎస్ఎఫ్ జవాన్లు కూల్చివేయగా, దాంతో పాటు కిలో హెరాయిన్ తోపాటు ఇనుప ఉంగరం లభించింది. సరిహద్దుల్లో డ్రోన్ల సంచారం పెరగడంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లలో నేషనల్ సెక్యూరిటీ గార్డులను మోహరించారు. దీంతోపాటు సరిహద్దుల్లో కీలకప్రాంతాల్లో యాంటీ డ్రోన్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. బీఎస్ఎఫ్ పరిధిని పలు రాష్ట్రాల్లో పెంచడం కూడా జరిగింది.
జమ్మూకశ్మీర్‌లోకి డ్రోన్ల ద్వారా ఆయుధాలు, డ్రగ్స్ సరఫరా చేయడానికి చాలా కాలంగా పాక్ ప్రయత్నాలు జరుపుతోంది. జమ్ము ఎయిర్ పోర్టులో డ్రోన్ తో దాడి జరిగిన అనంతరం భారత్ మరింత అప్రమత్తమై డ్రోన్లపై నిఘా పెంచింది.
మరో ఉగ్రవాది హతం:
జమ్మూకశ్మీర్ లో గురువారం ఉదయం ఉగ్రవాదులకు, కేంద్ర భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతం అయ్యాడు. బారాముల్లాలోని చెర్దారీలో గురువారం ఉదయం పోలీసులతో కలిసి సైనిక బలగాలు గాలిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతం అయ్యాడని కశ్మీర్ పోలీసు ఐజీ విజయ్ కుమార్ చెప్పారు. ఎన్‌కౌంటర్ అయిన ఉగ్రవాది జావేద్ అహ్ వానీగా గుర్తించామని, ఇతను కుల్గామ్ జిల్లాకు చెందిన వ్యక్తి అని పోలీసులు తెలిపారు. అతడి నుంచి ఒక పిస్టల్, లోడెడ్ మ్యాగజైన్, పాక్ గ్రెనెడ్ ను స్వాధీనం చేసుకున్నామని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. గతంలో వలసకూలీల హత్యల్లో ఈ ఉగ్రవాది జావేద్ పాల్గొన్నాడని పోలీసులు చెప్పారు.