More

  జమ్మూ కాశ్మీర్ లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై డ్రోన్ అటాక్

  జమ్మూ కాశ్మీర్ లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై డ్రోన్లతో దాడి జరిగింది. ఆదివారం నాడు రెండు తక్కువ-తీవ్రత గల పేలుళ్లు ఒక్క సారిగా టెన్షన్ వాతావారణాన్ని సృష్టించాయి. పేలుళ్ల మూలం గురించి ఖచ్చితమైన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. క్వాడ్‌కాప్టర్‌ను ఉపయోగించి ఈ దాడి జరిగిందని భావిస్తున్నారు. ఇదే నిజమైతే డ్రోన్‌లను ఉపయోగించి భారతదేశంలో జరిగిన మొదటి ఉగ్రవాద దాడులుగా భావించవచ్చు. ఈ పేలుడుకు వాడిన పదార్థాలు చాలా తక్కువ పరిణామంలో ఉన్నాయని తెలుస్తోంది. అలాగే ఉగ్రవాదులు తమ లక్ష్యాన్ని కోల్పోవడంతో భారీ నష్టం తప్పిందని తెలుస్తోంది. జమ్మూ ఎయిర్ పోర్ట్ లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై ఈ దాడి చోటు చేసుకుంది. ఆదివారం నాడు 5 నిమిషాల వ్యవధిలో ఈ పేలుళ్ళు చోటు చేసుకున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ డ్రోన్ పేలుళ్ల కారణంగా ఇద్దరు అధికారులు గాయపడ్డారని ఎయిర్ పోర్టు సిబ్బంది తెలిపింది. ఉదయం 1:37 సమయంలో ఒక బ్లాస్ట్, 1:42 సమయంలో మరో బ్లాస్ట్ చోటు చేసుకుంది.

  జమ్మూ కాశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) దిల్‌బాగ్ సింగ్ మాట్లాడుతూ.. హై-సెక్యూరిటీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ జంట పేలుళ్లను ఉగ్రవాద దాడి అని తెలిపారు. ఈ దాడి వెనుక ఉన్న మరింత సమాచారాన్ని తెలుసుకోడానికి పోలీసులు, ఇతర ఏజెన్సీలు ఐఎఎఫ్ అధికారులతో కలిసి పనిచేస్తున్నాయని ఆయన అన్నారు.

  చట్టవిరుద్ధ కార్యకలాపాలు (నివారణ) చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) స్వాధీనం చేసుకుంది. డ్రోన్లు ఎక్కడి నుండి వచ్చాయో గుర్తించే ప్రయత్నంలో ఉన్నారు. విమానాశ్రయం సరిహద్దు గోడలపై ఏర్పాటు చేసిన కెమెరాలతో సహా సిసిటివి ఫుటేజీని పరిశీలిస్తూ ఉన్నారు. అయితే సిసిటివి కెమెరాలన్నీ రోడ్డు వైపు కేంద్రీకృతమై ఉన్నాయని అధికారులు తెలిపారు. శత్రు కార్యకలాపాలను పర్యవేక్షించడానికి సరిహద్దు ప్రాంతాలలో మోహరించిన రాడార్ల ద్వారా డ్రోన్‌లను కనుగొనడం సాధ్యం కాదని, పక్షి లాగా చిన్నగా ఉండే డ్రోన్‌లను గుర్తించగల వేరే రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని వారు సూచించారు.

  ఈ పేలుళ్ల ఘటన గురించి ఎన్‌ఐఏ బృందం సహా.. ఉన్నత స్థాయి ఐఎఎఫ్‌ దర్యాప్తు బృందం కూడా సమగ్రంగా పరిశీలిస్తోందని ఐఎఎఫ్‌ అధికారులు తెలిపారు. వెస్ట్రన్ కమాండ్ ఎయిర్ చీఫ్ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదానికి ఆజ్యం పోసేందుకు ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఆయుధాలు, మాదకద్రవ్యాలు, హవాలా డబ్బులను పంపడానికిజమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్లను ఉపయోగించిన అనేక సంఘటనలు ఉన్నాయి. భద్రతా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లడఖ్‌లోని లేహ్ వద్ద ఉన్న సమయంలోనే ఈ సంఘటన జరిగింది.

  భారత్ కు డ్రోన్లతో ముప్పు పొంచి ఉందని నిపుణులు ఎప్పటి నుండో హెచ్చరిస్తూ వస్తున్నారు. టెర్రర్ గ్రూపుల చేతుల్లోకి డ్రోన్లు వెళ్లడం అత్యంత ప్రమాదకరం. దీనిపై భారత భద్రతా దళాలు ఆలోచించాల్సి ఉంటుంది.. మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇతర ప్రాంతాల్లో తీవ్రవాదులు డ్రోన్ల సహాయంతో ఈ దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. అక్టోబర్ 2016 లో, మోసుల్‌లోని ఐసిస్ దళాలు డ్రోన్‌లను ఉపయోగించిఎంత విధ్వంసం సృష్టించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు భారత భద్రతా బలగాలు ఈ ఘటన కారణంగా మరింత అప్రమత్తంగా ఉండాలి. రాబోయే రోజుల్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎటువంటి దాడులకైనా పాల్పడే అవకాశం ఉంది. నేడు జమ్మూ వైమానిక దళం స్టేషన్‌పై దాడి జరగ్గా.. రాబోయే రోజుల్లో పాఠశాలలు, ఆస్పత్రులు మరియు బహిరంగ సభల వంటి పౌర ఆస్తులను సమర్థవంతంగా లక్ష్యంగా దాడులు చేయగలరు. వీటి కారణంగా భారీగా ప్రాణ నష్టం చోటు చేసుకోవచ్చు.. భయానక వాతావరణం నెలకొల్పడంలో తీవ్రవాదుల లక్ష్యం నెరవేరినట్లే..!

  Trending Stories

  Related Stories