జమ్మూలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై కొద్దిరోజుల కిందట డ్రోన్ దాడి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే..! తాజాగా మరో డ్రోన్ అక్కడ చక్కర్లు కొట్టిందని అధికారులు తెలిపారు. ఈరోజు తెల్లవారుజామున 4.05 గంటలకు సత్వారీలోని ఎయిర్ బేస్ వద్ద డ్రోన్ కనిపించినట్టు అధికారులు వెల్లడించారు. ఎయిర్ బేస్ కు అతిసమీపంలోనే అది కనిపించింది.
బుధవారం తెల్లవారుజామున జమ్మూ ఎయిర్‌బేస్ సమీపంలో డ్రోన్ కార్యకలాపాలు మళ్లీ కనిపించడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. జమ్మూ వైమానిక దళం స్టేషన్ సమీపంలోనూ, అఖ్నూర్ లోని పల్లన్వాలా ప్రాంతంలో కంట్రోల్ లైన్ (ఎల్ఓసి) వెంట డ్రోన్లు కనిపించాయి. ఈ ప్రాంతంలోని చాలా చోట్ల తనిఖీలు ప్రారంభించారు. బుధవారం ఉదయం సుమారు తెల్లవారుజామున 4.05 గంటలకు సత్వారీలోని జమ్మూ ఎయిర్ బేస్ సమీపంలో ఒక డ్రోన్ కనిపించింది. “బుధవారం తెల్లవారుజామున సెక్టార్ సత్వారీలోని రెండు వేర్వేరు ప్రదేశాలలో మానవరహిత వైమానిక వాహనం (యుఎవి / అనుమానిత డ్రోన్లు) కనిపించాయని సమాచారం అందింది. ఉదయం నాలుగు గంటలకు సివిల్ విమానాశ్రయం మీదుగా ఒక డ్రోన్ కనిపించింది.. రెండవది జమ్మూ ఎయిర్ బేస్ సమీపంలో సత్వారీలోని పీర్ బాబా ప్రాంతంపై కనిపించాయి” అని ఓ అధికారి వెల్లడించారు. కొద్దిసేపటి తర్వాత ఈ డ్రోన్లు అదృశ్యమయ్యాయి. ఈ కార్యకలాపాల గురించి సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడమే కాకుండా.. వీటి గురించి సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టారు. జులై 15 న, జమ్మూలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సమీపంలో ఒక డ్రోన్ కనిపించగా, మరొకటి పల్లన్వాల్లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వెంట మరొకటి కనిపించింది. జమ్మూలోని ఆర్నియాలోని ఇంటర్నేషనల్ బోర్డర్ (ఐబి) వెంట అనుమానాస్పద డ్రోన్‌ను బిఎస్ఎఫ్ దళాలు గుర్తించాయి. పాకిస్తాన్ వైపుకు తిరిగి వెళ్లిపోవడం కూడా జరిగిపోయింది. ఈ రెండు సంఘటనలు 24 గంటలలోపు చోటు చేసుకున్నాయి.
జూన్ 27న జమ్మూ విమానాశ్రయంలోని భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై నిమిషాల వ్యవధిలో డ్రోన్లతో బాంబు దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో స్టేషన్ పైకప్పు దెబ్బతింది. ఆ తర్వాత కూడా రెండు మూడు సార్లు డ్రోన్లు అక్కడ చక్కర్లు కొట్టాయి. ఈ డ్రోన్ల దాడులు, సంచారం వెనుక విదేశీ శక్తులే ఉన్నాయని తమ దర్యాప్తులో తేలిందని జమ్మూకాశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ చెప్పారు. జమ్మూ ఎయిర్‌బేస్ వద్ద ఏర్పాటు చేసిన యాంటీ-డ్రోన్ టెక్నాలజీతో భారత్ ఈ డ్రోన్ లకు చెక్ పెట్టనుంది.