More

    జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ కలకలం..!

    జమ్మూకశ్మీర్ లోని ఆర్నియా సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో మంగళవారం (జూలై 13) అర్థరాత్రి ఒక డ్రోన్ కనిపించింది. డ్రోన్ కనపడగానే బి.ఎస్.ఎఫ్. జవానులు డ్రోన్ పై కాల్పులు జరిపారు. దీంతో ఆ డ్రోన్ పాక్ భూభాగం వైపు వెళ్ళిపోయింది. గ‌త 15 రోజుల వ్య‌వ‌ధిలో ఇటువంటి డ్రోన్లు క‌న‌ప‌డ‌డం ఇది ఆరో సారి. ఆర్నియా అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో డ్రోన్ భారత భూభాగంలోకి దాదాపు 150 మీట‌ర్ల‌మేర చొచ్చుకుని వ‌చ్చింది. ఆ ప్రాంతంలో ఎగురుతున్న డ్రోన్‌ను గుర్తించిన బీఎస్ఎఫ్ జ‌వాన్లు దానిపై కాల్పులు జరపడంతో అది వెనక్కు వెళ్ళిపోయింది. భార‌త స‌రిహ‌ద్దుల్లోని ప‌రిస్థితుల‌ను గుర్తించడానికి కానీ, ఆయుధాలు, మందు గుండు సామ‌గ్రిని జార విడిచేందుకు పాక్ ఆ డ్రోనును పంప‌డానికి ప్ర‌య‌త్నించిన‌ట్లు తెలుస్తోంది. సుమారు రెండువందల మీటర్ల ఎత్తులో అది సంచ‌రించిన‌ట్లు అధికారులు గుర్తించారు. ఆ డ్రోను తిరిగిన‌ ప్రాంతంలో గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

    అంతర్జాతీయ సరిహద్దు మీదుగా భారత భూభాగంలోకి డ్రోన్లను పంపేందుకు పాక్ కుట్రలు పన్నుతూ ఉంది. డ్రోన్ల ద్వారా పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతూ ఉన్నారని స్పష్టంగా తెలుస్తూ ఉండడంతో వాటిని కూల్చే పనుల్లో భారత సైన్యం ఉంది. కొద్ది రోజుల క్రితం జ‌మ్మూక‌శ్మీర్‌లోని ఎయిర్‌పోర్టులోని ఐఏఎఫ్ స్థావ‌రంపై డ్రోన్ల‌తో దాడి జ‌రిగింది. ఈ ఘటన చోటు చేసుకున్న అనంత‌రం జమ్మూ కాశ్మీర్ లోని ప‌లు ప్రాంతాల్లో డ్రోన్లు సంచ‌రిస్తూ క‌న‌ప‌డుతూ ఉన్నాయి. డ్రోన్ల ద్వారా ఆయుధాలు, మందు గుండు సామ‌గ్రి, డ్ర‌గ్స్ వంటివి జార‌విడిచే అవ‌కాశాలు ఉండ‌డంతో అవి సంచ‌రించిన ప్రాంతాల్లో జ‌వాన్లు వెంట‌నే గాలింపు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు.

    “జూలై 13-14 మధ్య రాత్రి, ఆర్నియా సెక్టార్‌లోని దళాలు ఆకాశంలో మెరిసే ఎర్రటి కాంతిని గమనించాయి. దళాలు ముందస్తు జాగ్రత్తగా ఎర్రటి మెరిసే కాంతి వైపు కాల్పులు జరిపాయి, దీంతో అది తిరిగి వెళ్ళిపోయింది. అది తిరిగిన ప్రాంతంలో వెతికాము. ఇంతవరకు ఏమీ కనుగొనబడలేదు ”అని బిఎస్ఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. జూన్ నెలలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై డ్రోన్లతో దాడి జరిగిన ఘటనలో ఇద్దరు భారత ఎయిర్ ఫోర్స్ అధికారులు గాయపడ్డారు. డ్రోన్ కార్యకలాపాలు పెరుగుతున్న సంఘటనలపై, జమ్మూ కాశ్మీర్‌లోని వివిధ జిల్లాల జిల్లా అధికారులు డ్రోన్లు, ఇతర మానవరహిత వైమానిక వాహనాల నిల్వ, అమ్మకం, కలిగి ఉండడంపై నిషేధించారు. యాంటీ డ్రోన్ సిస్టమ్ ను భారత ప్రభుత్వం వీలైనంత త్వరగా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

    Related Stories