More

  ఆ రెండు తేదీల్లో జమ్మూ లోని హిందూ దేవాలయాలను టార్గెట్ చేసే అవకాశం..?

  జమ్మూ కాశ్మీర్ లో ప్రశాంతతను దెబ్బ తీయడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తూనే ఉంది. తీవ్రవాదులకు మద్దతును ఇస్తూ వారిని రెచ్చగొడుతూనే ఉంది. ఈ ఆగస్టు 5కి ఆర్టికల్ 370 ను రద్దు చేసిన రెండవ వార్షికోత్సవం సందర్భంగా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలైన లష్కర్-ఎ-తైబా, జైష్-ఇ-మొహమ్మద్ జమ్మూ కాశ్మీర్‌లోని హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడవచ్చని భారత గూఢచార సంస్థలు భావిస్తున్నాయి. నివేదికల ప్రకారం, ఆగస్టు 5 న మరియు స్వాతంత్ర్య దినోత్సవం రోజైన ఆగస్టు 15 న హిందూ దేవాలయాలపై దాడి చేయవచ్చని నిఘా సంస్థలకు సమాచారం అందింది. దీంతో జమ్మూ కాశ్మీర్ లోని చాలా ప్రాంతాల్లో సెక్యూరిటీని మరింత పెంచేశారు. ప్రముఖ దేవాలయాల వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.

  సాంబా జిల్లాలో గ‌త‌ రాత్రి ఏకంగా మూడు ప్రాంతాల్లో డ్రోన్లు సంచ‌రించాయి. తొలి డ్రోన్‌ను బారి బ్ర‌హ్మ ప్రాంతంలో, రెండో డ్రోనును చ‌లియారి వ‌ద్ద గుర్తించిన‌ట్లు అధికారులు తెలిపారు. కొద్దిసేపటికి గ‌గ్వాల్ ప్రాంతంలో మూడో డ్రోనును గుర్తించారు. వాటిపై కాల్పులు జ‌ర‌ప‌డంతో వెనక్కు వెళ్లిపోయాయి. డ్రోన్లు సంచ‌రించిన ప్రాంతాల్లో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు త‌నిఖీలు చేపట్టాయి. డ్రోన్ల సంచారంతో సాంబా జిల్లాలో హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు.

  ఆగస్టు 5న డ్రోన్లతో దాడి జరిగే అవకాశం ఉందని, ఢిల్లీలో కూడా దాడి చేయడానికి పెద్ద ఎత్తున తీవ్రవాదులు ప్లాన్ చేస్తున్నారని నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారీ ఉగ్రదాడి జరగొచ్చని కేంద్ర నిఘా వర్గాలు ఇప్పటికే ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేశాయి. ఢిల్లీ పోలీసులకు ఆగస్టు 15 కు ముందే దాడి జరగొచ్చనే విషయమై భద్రతా సంస్థల నుండి సమాచారం అందింది. డ్రోన్ దాడి జరగొచ్చని భద్రతా సంస్థలు హెచ్చరికను జారీ చేశాయి. ఆగస్టు 5 న ఉగ్రదాడికి అవకాశం ఉన్నట్లు హెచ్చరించారు. మోదీ ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఆర్టికల్ 370 ను రద్దు చేసింది. అదే రోజున ఈ ఆపరేషన్ చేపట్టడానికి ఉగ్రవాదులు డ్రోన్ దాడిని ప్లాన్ చేస్తున్నారని ఏజెన్సీలు హెచ్చరించాయి. భద్రతా సంస్థలు సేకరించిన సమాచారం ప్రకారం, పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలు పేలుడు పదార్థాలు నిండిన డ్రోన్లను ఉపయోగించి ఉగ్రవాద దాడులు చేసే అవకాశం ఉంది. పాకిస్తాన్ మద్దతు ఉన్న టెర్రర్ గ్రూపులు ఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు భంగం కలిగించవచ్చని భద్రతా సంస్థలు తెలిపాయి. ఇటీవల పాకిస్తాన్ లో పట్టుబడిన డ్రోన్ కు కూడా పేలుడు పదార్థాలు కట్టిన విషయం తెలిసిందే.. అదే తరహాలో తీవ్రవాదులు టార్గెట్ చేసే అవకాశం ఉండొచ్చని అంటున్నారు.

  Trending Stories

  Related Stories