క్షురకుడిని కోటీశ్వరుడిని చేసిన DREAM11

డ్రీమ్ లెవెన్.. ఐపీఎల్ మ్యాచ్ చూసే సమయంలో మనకు ఎక్కువగా వినిపించే పేరు. ఇదొక ఫాంటసీ క్రికెట్ టీమ్ ను క్రియేట్ చేసి ఆడే గేమ్..! డ్రీమ్ 11లో మ్యాచ్ జరిగే జట్ల నుంచి ప్లేయర్స్‌ను ఎంచుకొని యూజర్లు తమ డ్రీమ్ జట్టును తయారు చేసుకుంటారు. మ్యాచ్‌లో ఆయా ఆటగాళ్లు ప్రదర్శన ఆధారంగా పాయింట్లు వస్తాయి. ఆ కంటెస్ట్‌లో విజయం సాధించిన వారు డబ్బులు గెలుచుకోవచ్చు. ఇందులో ఫ్రీ కంటెస్ట్ నుండి ఎన్నో రకాల కంటెస్ట్‌లు ఉంటాయి. ఔత్సాహికులు డబ్బులు చెల్లించి తమకు నచ్చిన కంటెస్ట్‌లో పాల్గొనవచ్చు. డ్రీమ్ 11 ఫాంటసీ క్రికెట్‌పై ఏపీ, తెలంగాణ, అసోం, ఒడిశా, నాగాలాండ్ రాష్ట్రాల్లో నిషేధం అమల్లో ఉంది. ఇందులో డబ్బులు పెట్టి ఎంతో మంది పోగొట్టుకుంటున్న వాళ్లు కూడా ఉన్నారు.
అయితే అదృష్టం ఎప్పుడు ఎవరిని.. ఎలా వరిస్తుందో అసలు ఊహించలేము. తాజాగా బీహార్ కు చెందిన బార్బర్ కు ఈ యాప్ లైఫ్ నే మార్చేసింది. బీహార్‌లోని మధుబని జిల్లాకు చెందిన అశోక్ ‘డ్రీమ్-11’లో బెట్టింగ్ కాస్తూ గత కొంతకాలంగా అదృష్టాన్ని పరీక్షించుకుంటూ వస్తున్నాడు. నానూర్ చౌక్ ప్రాంతంలో అశోక్ కుమార్ ఓ సెలూన్ నిర్వహిస్తున్నాడు. క్రికెట్ అంటే తొలి నుంచీ ఆసక్తి ఉన్న అతడు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ‘డ్రీమ్-11’లో బెట్టింగ్ కాస్తుండే వాడు. ఈ క్రమంలో ఐపీఎల్లో భాగంగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్-కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌పై బెట్టింగ్ కట్టిన అశోక్ ఏకంగా కోటి రూపాయలు గెలుచుకున్నాడు. విషయం తెలిసి అశోక్ ఆనందంలో మునిగి తేలుతున్నాడు. కేవలం 50 రూపాయలతో కోటి రూపాయల కాంటెస్ట్‌లో పాల్గొన్నాడు. ఆ రోజు అనూహ్యంగా అతడే విజేతగా నిలిచాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత నేను మొదటి స్థానంలో నిలిచాడు. ఆ కాంటెస్ట్‌లో రూ.కోటి వచ్చాయి. కాసేపటికే అధికారికంగా ఫోన్ కాల్ వచ్చింది. రాబోయే రెండు మూడు రోజుల్లో మీ ఖాతాలో రూ.70 లక్షలు జమవుతాయని చెప్పారని అశోక్ మీడియాకు తెలిపాడు. కోటి రూపాయల్లో పన్నులు పోగా మిగతా డబ్బులు అతడికి అందనున్నాయి. కోటి రూపాయలు వచ్చినంతమాత్రాన వృత్తిని వదులుకోబోనని చెప్పుకొచ్చాడు. అప్పులను తీర్చి, మిగిలిన డబ్బులతో మంచి ఇల్లు కట్టుకుంటానని తెలిపాడు.
